Prakasam Barrage : రాష్ట్రవ్యాప్తంగా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి మళ్లీ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద మరోసారి భారీ స్థాయిలో వరద నీటి ప్రవాహం నమోదవుతోంది. వరద ఉధృతి పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇటీవల మూడు రోజుల కిందట వరద ప్రవాహం అధికంగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేసిన అధికారులు, వరద తగ్గుముఖం పడటంతో ఆ హెచ్చరికను ఉపసంహరించారు. అయితే మళ్లీ బుధవారం నుంచి ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది. దీంతో తాజాగా మళ్లీ అప్రమత్తత ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Read Also: Voter Adhikar Yatra : బీజేపీ-ఎన్నికల సంఘం కుమ్మక్కు: ప్రజాస్వామ్యానికి అపహాస్యమన్న రాహుల్ గాంధీ
ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఎగువ ప్రాంతాల నుంచి 3.03 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో మొత్తం 69 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 2.97 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో (ప్రవాహం ప్రవేశం), ఔట్‌ఫ్లో (నీటి విడుదల) రెండూ సుమారు 4.05 లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) సూచించింది. నదీ పరివాహక ప్రాంతాల్లో పంట పొలాల్లోకి వెళ్ళొద్దని, వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన జారీ చేసింది.
మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ..ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. మధ్యాహ్నంలోపు మొదటి ప్రమాద హెచ్చరిక అధికారికంగా జారీ చేసే అవకాశం ఉంది. లంక గ్రామాలు, తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో ప్రజలు ముందస్తుగా రక్షణ చర్యలు తీసుకోవాలి. వినాయక చవితి నిమజ్జనాల్లో ఎలాంటి అజాగ్రత్తలు తీసుకోకూడదు అని తెలిపారు. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో వరద నీరు ప్రవేశించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజలకు సకాలంలో సమాచారం చేరవేస్తూ, అవసరమైన చోట్ల సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నదీ తీర ప్రాంతాల్లో గట్టి పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్నందున, వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ముందస్తు చర్యలకు పాల్పడుతోంది.