TelanganaPolitics మున్సిపల్ఎన్నికల ఫలితాలను ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమదే విజయమని అభివర్ణించుకుంటున్నాయి. ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకుని మూడు ప్రధాన పార్టీల నాయకులు ఇదే రకమైన వాదనలను వినిపిస్తున్నారు. తాము అనుకున్న దానికంటే ఎక్కువగానే స్థానాలు సాధించామని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్పార్టీల నేతలు చెబుతున్నారు. పట్టణాల్లోనూ తమకే పట్టం కట్టారని, 116 మున్సిపాలిటీల్లో 83 కైవసం కైవసం చేసుకున్నామని కాంగ్రెస్ చెబుతున్నది. 76 శాతం ఫలితాలను సాధించినట్లుగా ప్రకటించింది.
81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 68లో మెజారిటీ సాధించామని, 7 కార్పొరేషన్‌లలో 4 చోట్ల ఆధిక్యం సాధించామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్నాయకులు సైతం తాము గణనీయమైన స్థానాలు సాధించామని చెబుతున్నారు. స్పష్టమైన మెజార్టీతో 17 మున్సిపాలిటీలు గెలిచామని, మరో 17 మున్సిపాలిటీలతోపాటు కార్పొరేషన్‌లలో తమకు అవకాశాలు ఉండే విధంగా ఫలితాలు సాధించామని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేవలం మూడు, నాలుగు మున్సిపాలిటీల కంటే ఎక్కువ సాధించలేదని, కానీ నేడు తాము ఎక్కువ సంఖ్యలో గెలుచుకున్నామని గుర్తు చేస్తున్నారు. తమకు పెరుగుతున్న ఆదరణకు ఇదే నిదర్శనమని అంటున్నారు.
ఓట్లు, సీట్లు పెరిగాయని బీజేపీ విశ్లేషణ..
బీజేపీ కూడా ఈ ఫలితాలపై సంతృప్తి, హర్షాన్ని వ్యక్తం చేస్తుంది. గత ఎన్నికల కంటే ఎక్కువగానే తాము వార్డు సభ్యులను గెలుచుకున్నామని, అదే సమయంలో కరీంనగర్, నిజామాబాద్ మేయర్స్థానాలను కైవసం చేసుకోవడానికి కొద్దిదూరంలో ఉన్నామనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రెండు కీలకమైన నగర పాలక సంస్థలపై కాషాయ జెండా ఎగురవేయబోతున్నామని అంటున్నారు. హంగ్ ఉన్నచోట్ల తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లే కీలకమని చెబుతున్నారు. మొత్తంగా తమ పార్టీకి ఆదరణ పెరిగిందని విశ్లేషిస్తున్నారు. ఓట్లు కూడా పెరిగాయని చెప్తున్నారు.
