Telangana Rain Alert: తెలంగాణలో ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలే

తెలంగాణలో చాలా రోజుల తర్వాత వర్షాకాలం అనుభూతి కలుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గత రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో రాత్రి వేళల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదు కానంతగా వర్షపాతం నమోదవ్వడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో […]

Published By: HashtagU Telugu Desk
Torrential rains in these parts of Telangana.

Torrential rains in these parts of Telangana.

తెలంగాణలో చాలా రోజుల తర్వాత వర్షాకాలం అనుభూతి కలుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గత రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో రాత్రి వేళల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదు కానంతగా వర్షపాతం నమోదవ్వడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 124 మి.మీ, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 109.5 మి.మీ వర్షపాతం నమోదైంది.

కాగా, రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రోజంతా ముసురు పడే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే మూడు గంటల్లో సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే మెదక్, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని చెప్పారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, మెదక్, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చునని అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలోనూ ప్రస్తుతం ముసురు వాతావరణం కొనసాగుతోంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక సోమవారం సాయంత్రం నుంచి నగరంలో వర్షం కురుస్తూనే ఉంది. అత్యధికంగా మహేశ్వరంలో 34.3 మి.మీ, బాలాపూర్‌లో 30.8 మి.మీ, షేక్‌పేట్‌లో 23.5 మి.మీ, హఫీజ్‌పేట్‌లో 22.3 మి.మీ, మాదాపూర్‌లో 21.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

 

  Last Updated: 21 Jul 2026, 10:54 AM IST