Rain Alert: బలపడుతున్న అల్పపీడనం..!తెలంగాణలో భారీ వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని ఉత్తర, మధ్య, తూర్పు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ సైతం హెచ్చరించారు. నేడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, […]

Published By: HashtagU Telugu Desk
Low-pressure area intensifying! Heavy rains in Telangana... Here is the weather report.

Low-pressure area intensifying! Heavy rains in Telangana... Here is the weather report.

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని ఉత్తర, మధ్య, తూర్పు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ సైతం హెచ్చరించారు. నేడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

మరోవైపు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి సమయాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ఉత్తర, మధ్య, పశ్చిమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయని తెలిపారు. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నిర్మల్, ఆసిఫాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో రాత్రిపూట మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 101.5 మిమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

గత మూడు రోజులుగా కురుస్తున్న తరహాలోనే, రాజధాని హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందన్నారు. గత రాత్రి హైదరాబాద్ పశ్చిమ, ఉత్తర, మధ్య ప్రాంతాల్లో క్రమం తప్పకుండా జల్లులు కురిసినప్పటికీ, తూర్పు హైదరాబాద్ ప్రాంతాల్లో మాత్రం వర్షం కురవలేదు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అత్యధికంగా గోల్కొండలో 16.5 మిమీ, అమీన్‌పూర్‌లో 12.3 మిమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు.

  Last Updated: 20 Jul 2026, 10:03 AM IST