Wisden Award Winners: భారతదేశంలో క్రికెట్ ఇప్పుడు సరికొత్త శిఖరాలకు చేరుకుంది. దేశంలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ప్రతి ఏటా టీమ్ ఇండియాలో చోటు సంపాదించుకోవడానికి ఎంతో మంది మేటి ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. గత కొన్ని ఏళ్లుగా భారత జట్టు అద్భుత ప్రదర్శన చేస్తూ ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసింది. దీనికి తోడు ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన విజ్డెన్ అవార్డుల్లో కూడా భారత ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగడం గర్వించదగ్గ విషయం. విజ్డెన్ ప్రకటించిన 9 ప్రధాన అవార్డులలో ఏకంగా 7 అవార్డులను భారత ఆటగాళ్లే కైవసం చేసుకున్నారు.
భారత ఆటగాళ్ల ఆధిపత్యం
2025లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. భారత్ నుండి కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్.. నాటింగ్‌హామ్‌షైర్ కెప్టెన్ హసీబ్ హమీద్‌తో కలిసి టాప్-5 జాబితాలో నిలిచారు. ఆ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో గిల్ 269, 161 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లు ఆడి, ఆ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
Also Read: AP Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. వారికి స్పెషల్ లీవ్స్
మరోవైపు రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా తన ప్రత్యేకతను చాటుకోగా, రవీంద్ర జడేజా అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో మహమ్మద్ సిరాజ్ కూడా గత ఏడాది అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
దీప్తి, అభిషేక్ శర్మలకు కూడా అవార్డులు
వీరితో పాటు మరికొందరు భారత ఆటగాళ్లు కూడా అవార్డులు గెలుచుకున్నారు. మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన దీప్తి శర్మకు ‘లీడింగ్ ఉమెన్ క్రికెటర్’ అవార్డు లభించింది. యువ ఆటగాడు అభిషేక్ శర్మ ‘లీడింగ్ టీ20 క్రికెటర్’ అవార్డును దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ ‘లీడింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 430 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ ‘విజ్డెన్ ట్రోఫీ’ని తన సొంతం చేసుకున్నాడు.
