Sreesanth: ఆమె లేకపోతే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని : శ్రీశాంత్‌

మైదానంలో దూకుడుకు మారుపేరుగా నిలిచిన టీమిండియా మాజీ పేసర్ ఎస్. శ్రీశాంత్ తన జీవితంలోని అత్యంత చీకటి రోజుల గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని తిహార్ జైలులో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని, కానీ తన భార్య భువనేశ్వరి దేవి వల్లే ఆ ఆలోచనను విరమించుకుని బతికి ఉన్నానని ఆయన భావోద్వేగంతో తెలిపాడు. ఇటీవల ‘లల్లన్‌టాప్‌’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఈ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. భారత […]

Published By: HashtagU Telugu Desk
I would have committed suicide if not for her: Sreesanth

I would have committed suicide if not for her: Sreesanth

మైదానంలో దూకుడుకు మారుపేరుగా నిలిచిన టీమిండియా మాజీ పేసర్ ఎస్. శ్రీశాంత్ తన జీవితంలోని అత్యంత చీకటి రోజుల గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని తిహార్ జైలులో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని, కానీ తన భార్య భువనేశ్వరి దేవి వల్లే ఆ ఆలోచనను విరమించుకుని బతికి ఉన్నానని ఆయన భావోద్వేగంతో తెలిపాడు. ఇటీవల ‘లల్లన్‌టాప్‌’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఈ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.

భారత క్రికెటర్లలో రెండు ప్రపంచకప్‌లు (2007 టీ20, 2011 వన్డే) గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న అతికొద్ది మందిలో శ్రీశాంత్ ఒకడు. ఇంతటి ఘనత సాధించిన ఆటగాడి కెరీర్‌కు 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు పెద్ద మచ్చగా మారింది. ఈ కేసులో రాజస్థాన్ రాయల్స్ సహచరులు అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లతో పాటు శ్రీశాంత్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఆయన దాదాపు నెల రోజుల పాటు తిహార్ జైలులో గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత 2015లో కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించినప్పటికీ, ఆ సంఘటన తన జీవితాన్ని కుదిపేసిందని శ్రీశాంత్ వివరించాడు.

ఆ కష్టకాలంలో తన భార్య భువనేశ్వరి, ఆమె కుటుంబం తనకు కొండంత అండగా నిలిచారని శ్రీశాంత్ తెలిపాడు. జైపూర్‌లోని షెకావత్ రాజకుటుంబానికి చెందిన భువనేశ్వరితో తన పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. “2007లో ఓ స్కూల్ కార్యక్రమానికి అతిథిగా వెళ్లినప్పుడు ఆమెను మొదటిసారి కలిశాను. అప్పుడు ఆమె 10వ తరగతి చదువుతోంది. ఆ తర్వాత 2013 వరకు మేం టచ్‌లోనే ఉన్నాం. 2011 ప్రపంచకప్ గెలిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానని 2010లోనే ఆమెకు మాటిచ్చాను. నేను బెయిల్‌పై బయటకు వచ్చాక మా ఐదో సమావేశంలో నిశ్చితార్థం చేసుకున్నాం” అని శ్రీశాంత్ చెప్పాడు.

“జైలులో ఉన్నప్పుడు నేను ఆత్మహత్య చేసుకోకపోవడానికి ప్రధాన కారణం ఆమె. ఒకవైపు దేశం మొత్తం నన్ను విలన్‌లా చూస్తుంటే, ఆమె కుటుంబం మాత్రం నాకు మద్దతుగా నిలిచింది. నా భార్యే స్వయంగా లాయర్లతో మాట్లాడి నాకు బెయిల్ రావడానికి ఎంతగానో కృషి చేసింది. అందుకే నా బెయిల్‌కు కూడా ఆమే కారణం” అని శ్రీశాంత్ ఉద్వేగంగా అన్నాడు.

“ఢిల్లీ పోలీసుల కస్టడీలో 12 రోజులు, తిహార్ జైలులో 27 రోజులు గడిపిన తర్వాత సాధారణ జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు ఏమీ కావని అర్థమైంది. ఆ సమయంలో నా తల్లిదండ్రులు, మేనకోడలు, మేనల్లుడి గురించి ఆలోచిస్తూ కుమిలిపోయేవాడిని. ఆ వివాదం కారణంగా వాళ్లను స్కూల్‌కు కూడా పంపలేదు. నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా నాపైనే చర్చ జరిగింది. ఆ అనుభవం నన్ను మానసికంగా మరింత దృఢంగా మార్చింది” అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒకరికొకరు తోడుగా నిలిచిన శ్రీశాంత్, భువనేశ్వరి 2013లోనే వివాహం చేసుకున్నారు. శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు.

  Last Updated: 19 Jun 2026, 09:58 AM IST