అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో సొంత వేదికపై టైటిల్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఈ విజయంతో భారత్ మొత్తం మూడుసార్లు ఈ టోర్నీని గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. ఈ చారిత్రక విజయం సందర్భంగా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలక్టర్లకు బీసీసీఐ అభినందనలు తెలుపుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించింది.
ఐసీసీ నుంచి కూడా భారీ ప్రైజ్ మనీ
బీసీసీఐ ప్రకటించిన నజరానాతో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నుంచి కూడా భారత జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ లభించింది. టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచినందుకు సూర్యకుమార్ సేనకు ఐసీసీ 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 27.48 కోట్లు) బహుమతిగా అందించింది. ఈ టోర్నీ కోసం ఐసీసీ రికార్డు స్థాయిలో 13.5 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని కేటాయించింది. ఇది గత ఎడిషన్ కంటే 20 శాతం అధికం.
ఈ ఫైనల్ విన్నింగ్ అమౌంట్‌కు అదనంగా, టోర్నీలో గ్రూప్, సూపర్ 8 దశల్లో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు కూడా టీమిండియాకు బోనస్‌లు అందాయి. ప్రతి విజయానికి సుమారు 31,154 డాలర్లు (దాదాపు రూ. 28.6 లక్షలు) చొప్పున అదనపు మొత్తాన్ని భారత ఆటగాళ్లు సంపాదించారు. మొత్తంగా ఈ చారిత్రక విజయంతో భారత జట్టుపై బీసీసీఐ, ఐసీసీల నుంచి కోట్ల రూపాయల వర్షం కురిసింది.
