అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ 2026లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. ఫుట్‌బాల్ దిగ్గజంగా పేరు పొందిన క్రిస్టియానో రొనాల్డో తన చివరి ప్రపంచ కప్ మ్యాచ్‌ను ఓటమితో ముగించాడు. స్పెయిన్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ మ్యాచులో పోర్చుగల్ 1-0 తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. పోర్చుగల్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక 2 దశాబ్దాలకు పైగా తన ఆటతో మంత్రముగ్ధులను చేసిన రొనాల్డో, తన చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత భావోద్వేగానికి గురై కంటతడి పెట్టాడు.
పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 2006లో తొలిసారి ఫిఫా వరల్డ్ కప్ ఆడాడు. ఫిఫా ప్రపంచకప్ 2026 తనకు చివరి టోర్నీ అని రొనాల్డో ఇదివరకే ప్రకటించాడు. కానీ తన జట్టును మరోసారి క్వార్టర్ ఫైనల్‌కు తీసుకెళ్లాలన్న అతడి ఆశలు నెరవేరలేదు. స్పెయిన్ తరఫున మికెల్ మెరినో చేసిన ఏకైక గోల్ స్పెయిన్ విజయాన్ని, పోర్చుగల్ నిష్క్రమణను ఖాయం చేసింది. కాగా స్పెయిన్ 2010లో ఫిఫా ప్రపంచకప్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత ఒక్కసారి కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోలేదు. కానీ 16 ఏళ్ల తర్వాత మళ్లీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. స్పెయిన్ క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియంతో తలపడే అవకాశం ఉంది.
మరోవైపు ఈ మ్యాచ్‌తో స్పెయిన్ వరుసగా ఆరు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులకు గోల్ చేసే అవకాశమే ఇవ్వకుండా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇటలీ (1990), స్విట్జర్లాండ్ (2006-10) పేరిట ఉన్న ఐదు వరుస క్లీన్ షీట్‌ల రికార్డును ఆ జట్టు అధిగమించింది. గోల్ కీపర్ ఉనై సిమోన్ వ్యక్తిగతంగానూ అరుదైన ఘనత సాధించాడు. వరుసగా 609 నిమిషాల పాటు గోల్ ఇవ్వకుండా నిలిచి ప్రపంచ కప్ చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఇటలీ దిగ్గజ గోల్ కీపర్ వాల్టర్ జెంగా పేరిట ఉన్న 517 నిమిషాల రికార్డును అతడు బ్రేక్ చేశాడు.
ఇక 41 ఏళ్ల రొనాల్డో అరుదైన రికార్డు సాధించాడు. ఆరు ప్రపంచకప్‌లు ఆడిన ఇతడు అన్నింట్లోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. తాజా టోర్నీలో అతడు మూడు గోల్స్ చేశాడు. ఆరు సార్లు ప్రపంచకప్ ఆడినా రొనాల్డో మాత్రం ట్రోఫీ అందుకోలేకపోయాడు. తన డెబ్యూ ప్రపంచకప్ అయిన 2006లో రొనాల్డో జట్టు సెమీస్ వరకూ చేరింది. ఇదే అతడి కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన. మొత్తంగా ప్రపంచకప్‌లో అతడు 27 మ్యాచులలో 11 గోల్స్ చేశాడు.
