వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా సూప‌ర్ విక్ట‌రీ.. భార‌త్‌కు ఊర‌ట‌!

సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించడం భారత జట్టుకు పెద్ద ఊరటనిచ్చింది. ఎందుకంటే అంతకుముందున్న సమీకరణాలతో పోలిస్తే ఇప్పుడు భారత్ సెమీఫైనల్ దారి చాలా వరకు సులభమైంది.

Published By: HashtagU Telugu Desk
SA vs WI

SA vs WI

SA vs WI: వెస్టిండీస్‌ను సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఎయిడెన్ మార్క్రామ్ కరీబియన్ బౌలర్లను ఊచకోత కోస్తూ 82 పరుగుల శక్తివంతమైన, చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడారు. ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్‌లో తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. ఆఫ్రికా సాధించిన ఈ విజయం టీమ్ ఇండియాకు కూడా కలిసొచ్చే అంశం.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసింది. వెస్టిండీస్ 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ జేసన్ హోల్డర్ (49 పరుగులు), రొమారియో షెపర్డ్ (52 పరుగులు) అద్భుతంగా ఆడారు. హోల్డర్, షెపర్డ్ 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి వెస్టిండీస్ స్కోరును 176 పరుగులకు చేర్చారు.

Also Read: విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక పెళ్లి ఫొటోలు ఇవే!

ఎయిడెన్ మార్క్రామ్ విశ్వరూపం

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రామ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కేవలం 8 ఓవర్లలోనే 95 పరుగులు జోడించి వెస్టిండీస్ బౌలింగ్ విభాగం నడ్డి విరిచారు. డికాక్ 24 బంతుల్లో 47 పరుగులు చేయగా, కెప్టెన్ మార్క్రామ్ 82 పరుగులతో అజేయంగా నిలిచారు. తన ఇన్నింగ్స్‌లో ఆయన 7 ఫోర్లు, 4 సిక్సర్లు బాదారు.

వీరితో పాటు ర్యాన్ రికెల్టన్ 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఒకవేళ ఈ రోజు సాయంత్రం భారత్ గనుక జింబాబ్వేను ఓడిస్తే సౌత్ ఆఫ్రికా అధికారికంగా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. మార్క్రామ్ బ్యాటింగ్ సునామీకి ముందు బౌలింగ్‌లో లుంగి ఎన్గిడి 3 వికెట్లు తీసి కరీబియన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. కగిసో రబడ, కార్బిన్ బాష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

భారత్‌కు ఊరట

సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించడం భారత జట్టుకు పెద్ద ఊరటనిచ్చింది. ఎందుకంటే అంతకుముందున్న సమీకరణాలతో పోలిస్తే ఇప్పుడు భారత్ సెమీఫైనల్ దారి చాలా వరకు సులభమైంది. ఇప్పుడు టీమ్ ఇండియా సెమీఫైనల్ చేరాలంటే తన తదుపరి రెండు మ్యాచ్‌లను గెలిస్తే సరిపోతుంది.

  Last Updated: 26 Feb 2026, 07:20 PM IST