ఒకప్పుడు “లావుగా ఉన్నావు” అంటూ బాడీ షేమింగ్‌కు గురైన చెన్నైకి చెందిన యువ అథ్లెట్ కృష్ణ జయశంకర్ నేడు భారత అథ్లెటిక్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. 29వ నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల షాట్‌పుట్ విభాగంలో కృష్ణ జయశంకర్ 17.35 మీటర్ల దూరం షాట్‌ను విసిరి తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆమె బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. శరీరాకృతిని ఎద్దేవా చేస్తూ వచ్చిన విమర్శలను కృష్ణ జయశంకర్ పట్టించుకోలేదు. సమాజం విధించిన అందాల ప్రమాణాలకు తలవంచకుండా, తన శారీరక బలాన్నే విజయానికి ఆయుధంగా మార్చుకున్నారు. కఠినమైన శ్రమ, పట్టుదలతో నేడు దేశానికి గర్వకారణంగా నిలిచారు.
జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన కృష్ణ జయశంకర్ తదుపరి లక్ష్యం 2028 సమ్మర్ ఓలంపిక్స్. లాస్ ఏంజెల్స్‌లో జరిగే 2028 ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని ఎగరవేయాలని ఆమె కలలు కంటున్నారు. కృష్ణ జయశంకర్ ప్రయాణం ప్రతి యువతికి ఒక స్ఫూర్తి. విమర్శలు, అవహేళనలు ఎంత వచ్చినా లక్ష్యంపై దృష్టి పెట్టి కష్టపడితే విజయాన్ని సాధించవచ్చని ఆమె నిరూపించారు.
క్రీడా కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయికి.. కృష్ణ జయశంకర్ స్ఫూర్తిదాయక ప్రయాణం
కృష్ణ జయశంకర్ క్రీడలంటే ప్రాణంగా భావించే కుటుంబంలో పెరిగింది. ఆమె తల్లిదండ్రులిద్దరూ భారత బాస్కెట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు. చిన్నప్పటి నుంచి క్రీడా వాతావరణంలో పెరిగిన కృష్ణకు మొదట జట్టు క్రీడలపైనే ఎక్కువ ఆసక్తి ఉండేది. అయితే ఐదవ తరగతిలో చదువుతున్న సమయంలో ఒక శారీరక విద్యా ఉపాధ్యాయుడు ఆమెలోని అసాధారణ ప్రతిభను గుర్తించాడు. అతని ప్రోత్సాహంతో కృష్ణ త్రోయింగ్ ఈవెంట్ల వైపు అడుగులు వేసింది. ఆ నిర్ణయమే ఆమె జీవితాన్ని మార్చేసింది. క్రమంగా తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ, యుక్తవయస్సు చివరినాటికే జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ విజయాల వెనుక ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయి. తన శరీరాకృతిపై పలువురు చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు ఆమెను బాధించినప్పటికీ, వాటిని ధైర్యంగా ఎదుర్కొంది. ముఖ్యంగా తన సోదరి ఇచ్చిన మద్దతు, ప్రోత్సాహం వల్లే తనపై తాను నమ్మకం పెంచుకుని ముందుకు సాగగలిగానని కృష్ణ పలుమార్లు పేర్కొంది. సమాజం విధించిన అందం ప్రమాణాలను పట్టించుకోకుండా, తన శక్తి, ప్రతిభలనే విజయానికి ఆయుధాలుగా మార్చుకున్న కృష్ణ జయశంకర్ నేడు భారత అథ్లెటిక్స్‌లో స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచింది.
కృష్ణ జయశంకర్ సాధించిన అరుదైన ఘనతలు ఇవే..
- ఇండోర్ షాట్‌పుట్‌లో 16 మీటర్ల మార్క్ దాటిన తొలి భారతీయ మహిళ
- అమెరికాలోని NCAA డివిజన్-1 స్కాలర్‌షిప్ పొందిన తొలి భారతీయ మహిళా త్రోయర్కే
- వలం 18 ఏళ్ల వయసులోనే జమైకాకు వెళ్లి అంతర్జాతీయ స్థాయి శిక్షణ పొందిన క్రీడాకారిణి
