Shivam Dube: టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ తర్వాత టీమ్ ఇండియా ఆరో బౌలింగ్ ఆప్షన్ గురించి మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 72 పరుగుల తేడాతో విజయం సాధించి, ‘మెన్ ఇన్ బ్లూ’ జట్టు తిరిగి గెలుపు బాట పట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 256/4 భారీ స్కోరును నమోదు చేసింది. అయితే జింబాబ్వే ఓడిపోయినప్పటికీ తమ 20 ఓవర్లలో 184/6 పరుగులతో గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది.
బౌలింగ్ విషయంలో ఆందోళన ఉందా?
ఇది బ్యాటింగ్‌కు చాలా అనుకూలమైన పిచ్ కావడంతో టీమ్ ఇండియా ఓవరాల్ బౌలింగ్ ప్రదర్శనపై శ్రీకాంత్ పెద్దగా ఆందోళన చెందలేదు. కానీ ఆరో బౌలర్ ఆప్షన్‌గా బరిలోకి దిగిన శివం దూబే ప్రదర్శనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దూబే బౌలింగ్‌లో అదుపు లేదని, నో-బాల్స్, వైడ్లు వేస్తూ చాలా పరుగులు సమర్పించుకున్నారని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. మొత్తం మీద అతను 2 ఓవర్లలోనే 46 పరుగులు ఇచ్చాడు.
Also Read: భారత్- వెస్టిండీస్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది?
దూబే బౌలింగ్‌పై ప్రశ్నలు
దూబే ఖరీదైన బౌలింగ్ గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ.. బౌలింగ్ నాకు పెద్ద సమస్యగా అనిపించడం లేదు. ఇది బ్యాటింగ్‌కు మంచి పిచ్. నా ఏకైక ఆందోళన ఆరో బౌలర్ గురించే. దూబే బౌలింగ్ చేస్తున్న చోటును మీరు గమనించారా? అతను 6వ స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. ఇలాంటి బౌలింగ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు అని విమర్శించారు.
దూబే తన 2 ఓవర్లలో ఒక వికెట్ తీసినప్పటికీ భారీగా పరుగులు ఇవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దక్షిణాఫ్రికా ఇప్పటికే వెస్టిండీస్‌ను ఓడించడంతో నెట్ రన్ రేట్ భారత్‌కు పెద్ద సమస్యగా లేదు. బోర్డుపై భారీ స్కోరు ఉండటంతో దూబేకు కొంత బౌలింగ్ ప్రాక్టీస్ ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావించి ఉంటుందని శ్రీకాంత్ పేర్కొన్నారు.
