MS Dhoni: ఐపీఎల్ 2026 సీజన్‌లో అన్ని జట్లు ఇప్పటికే సగానికి పైగా లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాయి. టోర్నమెంట్ సగం దశ దాటినా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రం ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా మైదానంలో కనిపించలేదు. ఈరోజు అంటే ఆదివారం (ఏప్రిల్ 26) చెన్నై తన ఎనిమిదవ లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు అభిమానులందరి మదిలో మెదులుతున్న ఏకైక ప్రశ్న ఈరోజు ధోనీ ఆడతారా? అని. ధోనీ ఫిట్‌నెస్‌కు సంబంధించి తాజా అప్‌డేట్స్ ఇప్పుడు చూద్దాం.
నేడు సీజన్‌లోని 37వ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ ముందే ధోనీ పునరాగమనంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
Also Read: ప్రేమ పేరుతో ట్రాప్.. రూ. 9 కోట్ల మోసం చేసిన అషు రెడ్డి
గుజరాత్‌పై ధోనీ ఆడతారా? మైకేల్ హస్సీ ఏమన్నారు?
ముంబై- చెన్నై మ్యాచ్ సందర్భంగా సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ ధోనీ రాకపై స్పష్టతనిచ్చారు. ధోనీ కేవలం బ్యాటర్‌గా కాకుండా, వికెట్ కీపర్ బ్యాటర్‌గానే జట్టులోకి వస్తారని ఆయన తెలిపారు. ధోనీ ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ ఇస్తూ.. రాబోయే కొన్ని మ్యాచ్‌ల్లో ధోనీ ఆడతారని మేము ఆశిస్తున్నాము. అయితే అతను మైదానంలో తన అత్యుత్తమ ప్రదర్శన చేయాలంటే దాదాపు 100 శాతం ఫిట్‌గా ఉండాలి అని హస్సీ పేర్కొన్నారు. అంతేకాకుండా అతని కోలుకునే ప్రక్రియ బాగుంది. ధోనీ వీలైనంత త్వరగా తిరిగి రావడానికి శ్రమిస్తున్నారు. అభిమానులు కూడా ఆయన్ని మైదానంలో చూడాలని ఆరాటపడుతున్నారు అని హస్సీ చెప్పుకొచ్చారు.
The OG Keepers Club 💛🫂#WhistlePodu #GTvCSK pic.twitter.com/qd5VzpEf3B
— Chennai Super Kings (@ChennaiIPL) April 25, 2026
ప్రాక్టీస్ వీడియోతో పెరిగిన ఆశలు
గుజరాత్‌తో జరిగే నేటి మ్యాచ్‌లో ధోనీ ఆడతారా లేదా అనే దానిపై చెన్నై ఫ్రాంచైజీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ మరోవైపు ధోనీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతంలో కూడా ఇటువంటి ప్రాక్టీస్ వీడియోలు వచ్చినప్పటికీ తాజా వీడియోలు అభిమానుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. మరి ఈరోజు చెపాక్ స్టేడియంలో ధోనీ మెరుపులు కనిపిస్తాయో లేదో చూడాలి.
