ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

కొంతకాలం క్రితం షాపూర్ ఆరోగ్యం మెరుగుపడినట్లు అనిపించినా ఇప్పుడు HLH ఇన్‌ఫెక్షన్ మళ్ళీ తిరగబెట్టింది. ఆయన ప్రస్తుతం HLH స్టేజ్-4లో ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
Former Pacer

Former Pacer

Former Pacer: అఫ్గానిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. ఆయన ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. HLH అనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధితో ఆయన గత కొన్ని నెలలుగా పోరాడుతున్నారు. జద్రాన్ 2009 నుండి 2020 వరకు అఫ్గానిస్థాన్ తరపున 44 వన్డేలు, 36 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. గతేడాదే ఆయన క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత నుండే ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది.

గతేడాది నుండే అనారోగ్యం

షాపూర్ జద్రాన్ తమ్ముడు ఘమాయ్ జద్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్ గతేడాది అక్టోబర్‌లో అనారోగ్యానికి గురయ్యాడు. మెరుగైన చికిత్స కోసం వైద్యులు భారత్‌కు వెళ్లాలని సూచించారు. అఫ్గాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్, అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డ్ సహాయంతో జనవరి 19న ఆయన్ను న్యూఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ESPN క్రిక్‌ఇన్‌ఫోతో ఘమాయ్ మాట్లాడుతూ.. “ఇది చాలా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్. ఇది ఆయన శరీరం మొత్తానికి పాకడమే కాకుండా మెదడుపై కూడా ప్రభావం చూపుతోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

మళ్ళీ క్షీణించిన ఆరోగ్యం

కొంతకాలం క్రితం షాపూర్ ఆరోగ్యం మెరుగుపడినట్లు అనిపించినా ఇప్పుడు HLH ఇన్‌ఫెక్షన్ మళ్ళీ తిరగబెట్టింది. ఆయన ప్రస్తుతం HLH స్టేజ్-4లో ఉన్నారు. ఘమాయ్ తన సోదరుడి ఆరోగ్యంపై అప్‌డేట్ ఇస్తూ.. “గత 20 రోజులుగా ఆయన కోలుకుంటున్నట్లు కనిపించారు. కానీ ఇన్‌ఫెక్షన్ మళ్ళీ వచ్చింది. ఆయనకు తీవ్రమైన జ్వరం రావడంతో పరీక్షలు చేయగా డెంగ్యూ అని తేలింది. ఆయన శరీరంలో రోగ నిరోధక శక్తి చాలా తగ్గిపోయింది. ఎర్ర రక్త కణాలు (RBC) కూడా పడిపోయాయి” అని తెలిపారు. అయితే ఇటీవల ఇస్తున్న మందులు కొంత ఆశాజనకంగా ఉన్నాయని, ఆయన నెమ్మదిగా కోలుకుంటారని ఆశిస్తున్నామని ఘమాయ్ చెప్పారు. ఈ కష్టకాలంలో రషీద్ ఖాన్ ఆయనకు అండగా నిలవగా, ఇటీవల ముంబై ఇండియన్స్ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ కూడా ఆసుపత్రికి వెళ్లి జద్రాన్‌ను పరామర్శించారు.

  Last Updated: 21 Apr 2026, 12:58 PM IST