Site icon HashtagU Telugu

Chahal: త్రుటిలో చావు నుంచి తప్పించుకున్నా, బెంగళూర్ ఆటగాడిపై చాహల్ కామెంట్స్

Yuzvendra Chahal

Chahal

ఐపీఎల్ లో గత 8 సీజన్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడి, ఈ సీజన్ లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడుతున్న టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌.. తాను అత్యుత్తమ ఆటగాడిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన ఆర్సీబీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చహల్‌ మాట్లాడుతూ.. ఓ ఆర్సీబీ ఆటగాడి కారణంగా ఐపీఎల్ 2013 సీజన్ లో తానూ చావు నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చాడు.. ఈ క్రమంలో చాహల్ మాట్లాడుతూ.. ఈ సంఘటనను ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదు. 2013లో నేను ముంబయి ఇండియన్స్ జట్టులో ఉన్నాను. ఆ సీజన్ లో ఆర్సీబీతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లందరం కలిసి పార్టీ చేసుకున్నాం..

ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ ఆర్సీబీ క్రికెటర్ ఆ పార్టీ ముగిసిన తర్వాత నన్ను దగ్గరికి రమ్మని పిలిచాడు. నేను అతని దగ్గరికి వెళ్లగానే అతను నన్ను ఒక్కసారిగా పైకి ఎత్తుకుని 15వ ఫ్లోర్ బాల్కానీ నుంచి కిందకి వేలాడదీశాడు. దాంతో.. ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకున్న నేను నా చేతుల్ని అతని మెడ చుట్టూ వేసి పట్టుకున్నాను. ఆ సమయంలో నా అరుపులు విని అక్కడికి వచ్చిన నా సహచర ఆటగాళ్లు నన్ను కిందకి దించి రక్షించారు. ఆ ఘటన తరువాత ఒక 10నిముషాలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు. కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను అని చాహల్ నెమరు వేసుకున్నాడు.

ఇక ఐపీఎల్ 2014 సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ఆడిన చాహల్‌ని ఈ ఏడాది వేలానికి ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. దాంతో.. మెగా వేలంలో రూ.6.50 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 117 మ్యాచ్‌లాడిన చాహల్ 146 వికెట్లు పడగొట్టాడు.

Exit mobile version