Gujarat: వరుడు లేకుండానే పెళ్లి.. తాళి తానే కట్టుకుంది!

వరుడు లేకుండా తనకు తానే పెళ్లి చేసుకుంటానన్న గుజరాత్ యువతి క్షమాబిందు..

  • Written By:
  • Updated On - June 9, 2022 / 02:19 PM IST

వరుడు లేకుండా తనకు తానే పెళ్లి చేసుకుంటానన్న గుజరాత్ యువతి క్షమాబిందు.. ముహూర్తానికి 3 రోజుల ముందే నిన్న స్వీయ వివాహం చేసుకుంది. గుడిలో పెళ్లికి అనుమతి లేదని అధికారులు చెప్పడంతో ఇంట్లోనే సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. సిందూరం ధరించి పెళ్లికూతురిగా మారింది. వరుడు లేకుండానే తనకు తానే ఏడడుగులు నడిచింది. మంగళసూత్రం కూడా తానే కట్టుకుంది. త్వరలో హనీమూన్ కోసం ఒంటరిగా గోవాకు వెళ్లనుంది.

ఇది స్వీయ వివాహం. సోలోగ‌మీ. అంటే త‌న‌ను త‌నే పెళ్లి చేసుకోవ‌డం. గుజ‌రాత్‌కు చెందిన యువ‌తి క్ష‌మ బిందు ఇటీవ‌ల ఈ త‌ర‌హా వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుని సంచ‌ల‌నం సృష్టించింది. `స్వీయ వివాహం అంటే నీ కోసం నీవు క‌ట్టుబ‌డి ఉండ‌డం, నీపై నీకు అవ‌ధులు లేని స్వ‌చ్ఛ‌మైన‌ ప్రేమ ఉండ‌డం` అని ఈ 24 ఏళ్ల వ‌డోద‌ర యువ‌తి నిర్వ‌చిస్తోంది. త‌న స్వీయ వివాహ నిర్ణయాన్ని ఆమె కుటుంబం అంగీక‌రించింది. స‌మ‌ర్ధించింది. పూర్తి స‌పోర్ట్ కూడా చేస్తోంది. `నా దృష్టిలో స్వీయ వివాహం అంటే నిన్ను నీవు సంపూర్ణంగా అంగీక‌రించ‌డం. సాధార‌ణంగా వేరే వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కొంద‌రు పెళ్లి చేసుకున్న త‌రువాత జీవిత భాగ‌స్వామిని ప్రేమిస్తారు. కానీ, నాకు నేనంటేనే ప్రేమ‌. అందుకే న‌న్ను నేనే పెళ్లి చేసుకుంటున్నా` అని పెళ్లి కూతురు క్ష‌మ బిందు స్ప‌ష్టం చేశారు.