పేదలకు వరంలా మౌనిక చారిటబుల్ ట్రస్ట్ సేవలు..
రాపూరు: పేద ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని నెల్లూరు ఆర్డీవో నాగ సంతోషిణి అనూష కొనియాడారు. శుక్రవారం రాపూరులోని 10వ వార్డు లక్ష్మీపురం కాలనీలో మౌనిక చారిటబుల్ ట్రస్ట్, దేవీ సీ ఫుడ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. నిరుపేదలకు నిరంతరం ఉచితంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడం గొప్ప విషయమన్నారు. ఈ ప్రాంతంలో నివసించే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన కూలీలు కలుషిత నీటి వల్ల వ్యాధుల బారిన పడకుండా, వారి ఆరోగ్య పరిరక్షణ కొరకు ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మౌనిక రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి కొనియాడారు.
ట్రస్టు ద్వారా ముందు ముందు మరిన్ని సేవలు….
మౌనికా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవలు భవిష్యత్తులో నిర్వహించబోతున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ మౌనిక రెడ్డి తెలిపారు. కార్యక్రమం అనంతరం మాట్లాడుతూ తమ పిలుపును మన్నించి ప్లాంట్‌ను ప్రారంభించిన ఆర్డీవో గారికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో దేవీ సీ ఫుడ్స్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమానికి ‘దేవీ సీ ఫుడ్స్’ వారు తమ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ ప్లాంట్ నిర్మాణానికి పూర్తి ఆర్థిక సహకారం అందించారు. సంస్థ ప్రతినిధి ఎన్.వి.రావు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులకు 100 వాటర్ క్యాన్లను ఉచితంగా అందించారు. తమ కాలనీలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల లక్ష్మీపురం నివాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
