UK Flights Delays: ఆ కారణంతో యూకే లో వందల విమానాలు రద్దు.. ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు?

తాజాగా యూకేలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య రావడంతో దేశవ్యాప్తంగా కొన్ని వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అయ్యాయ

  • Written By:
  • Publish Date - August 29, 2023 / 03:16 PM IST

తాజాగా యూకేలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య రావడంతో దేశవ్యాప్తంగా కొన్ని వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. కొన్ని విమానాలు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో వందల సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయంలో విమానాల కోసం పడిగాపులు కాస్తున్నారు. కాకుండా కొన్ని ప్రదేశాలకు విమాన సర్వీసులు రద్దు కావడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. యూకేకు రావాల్సిన విమానాల్లో కూడా జాప్యం చోటు చేసుకోవడంతో వేలాది మంది విదేశాల్లోనే చిక్కుకుపోయారు.

ఈ సాంకేతిక సమస్యను కొన్ని గంటల వ్యవధిలోనే సరిచేశారు. కానీ, విమానయాన సర్వీసుల్లో, ఎయిర్‌ పోర్టుల్లో జాప్యం కొనసాగుతోంది. ఈ పరిస్థితి కొన్ని రోజులపాటు కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిపై హీత్రూ విమానాశ్రయం సోమవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. విమాన సర్వీసు షెడ్యూల్‌ అమల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో మంగళవారం టికెట్లు బుక్‌ చేసుకొన్నవారు ఎయిర్‌ పోర్టుకు బయల్దేరే ముందు విమానయాన సంస్థను సంప్రదించండి అని వెల్లడించింది సదరు సంస్థ. ఇక గాట్విక్‌ ఎయిర్‌ పోర్టు మాత్రం నేటి నుంచి సాధారణ షెడ్యూల్‌లో విమానాలను నడపాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తోంది.

కానీ, ప్రయాణికులు విమానాల స్టేటస్‌ను ఎయిర్‌లైన్స్‌ వద్ద ధ్రువీకరించుకొని బయల్దేరాలని వెల్లడించింది. లూటన్‌ ఎయిర్‌ పోర్టులో షెడ్యూల్‌ జాప్యాలు నెలకొన్నాయి. యూకేలోని నాట్స్‌ తొలుత ఆటోమేటెడ్‌ ఫ్లైట్‌ ప్లానింగ్‌ సిస్టమ్‌లో సమస్యను సోమవారం మధ్యాహ్నం గుర్తించింది. దాదాపు నాలుగు గంటలపాటు ఇది మొరాయించినట్లు తెలుస్తోంది. దీంతో విమానాల షెడ్యూల్‌ ఆటోమెటిక్‌ వ్యవస్థలో సమస్యలు మొదలయ్యాయి. ఈ కారణంగా సిబ్బంది మాన్యువల్‌గా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో జాప్యం మొదలైంది. ఈ లోపాన్ని గుర్తించిన వెంటనే సరిచేసినట్లు నాట్స్‌ వెల్లడించింది. కాకపోతే విమాన ప్రయాణాలు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది.ఈ విషయం పై నాట్స్‌ స్పందిస్తూ.. మేము ఈ లోపం కారణంగా ప్రభావిత సర్వీసులను సాధారణ స్థితికి చేర్చేందుకు విమానయాన సంస్థలు, సిబ్బందితో కలిసి పనిచేస్తున్నాము. మా ఇంజినీర్లు జాగ్రత్తగా ఫ్లైట్‌ ప్లానింగ్‌ సిస్టమ్‌ పనితీరును గమనిస్తున్నారు. మేము సాధారణ స్థితికి చేరతాం అని వెల్లడించింది.