ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర్వాత అతని నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ఆ రోజు తాను ఒక బేకరీ వద్ద ఉన్నానని, అక్కడి నుంచి తన నివాసానికి వెళ్తున్నానని తల్లికి చెప్పిన మణిదీప్, కొంత డబ్బు కూడా పంపించాలని కోరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పాటు, సోషల్ మీడియా, ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో కుటుంబం ఆందోళన చెందింది. ఫిన్లాండ్‌లోని అతని స్నేహితులు, రూమ్‌మేట్స్‌ను సంప్రదించినప్పటికీ సరైన సమాచారం లభించలేదని తల్లిదండ్రులు వెల్లడించారు. యూనివర్సిటీ యాజమాన్యం కూడా స్పష్టమైన వివరాలు ఇవ్వలేకపోవడంతో, గుజ్జ మర్ణత, ముత్యం రెడ్డి దంపతులు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖ, ఫిన్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులు తదితర అధికారులను వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఫిన్లాండ్‌లో స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే గాలింపు చర్యల్లో పురోగతి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మణిదీప్‌ను గుర్తించేందుకు డిజిటల్, బ్యాంకింగ్, విద్యా, రవాణా, సీసీటీవీ రికార్డులను పరిశీలించాలని, భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు.జూన్ 24న ఈ కేసును తెలంగాణ హైకోర్టు మళ్లీ విచారించనుంది. అప్పటివరకు తమ కుమారుడి క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
