మొబైల్ ఫోన్లతో ఆన్సర్ షీట్లను స్కాన్ చేసి దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ బోర్డుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 12వ తరగతి డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఓ ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలను తుంగలో తొక్కడం వల్లే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ధ్వజమెత్తారు.
ఒక్క కంపెనీ కోసం?
ఈ వివాదంపై పరిశోధన చేసిన విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ నివేదికను రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘మే 2025లో విడుదల చేసిన సీబీఎస్ఈ టెండర్ నిబంధనల ప్రకారం.. ఆన్సర్ షీట్లను ఆటోమేటిక్ రోబోటిక్ స్కాన్లతో కనీసం 300 డీపీఐ స్పష్టతతో స్కాన్ చేయాలి. కానీ ఆగస్టులో మళ్లీ విడుదల చేసిన టెండర్‌లో ఈ రూల్స్ అన్నింటినీ గుట్టుచప్పుడు కాకుండా తొలగించారు’’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. ‘కోఎప్ట్ ఎడ్యూటెక్’ అనే ఒకే ఒక్క ప్రైవేట్ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టడానికే నిబంధనలను మార్చారని ఆరోపించారు.
మొబైల్ ఫోన్లతో స్కాన్
టెండర్ మార్పుల వల్ల స్కాన్ల క్వాలిటీని 200 డీపీఐకి తగ్గించారని చివరికి సదరు సంస్థ ఆన్సర్ షీట్లను ప్రొఫెషనల్ స్కానర్లతో కాకుండా మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసిందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఫలితంగా ఆన్‌లైన్ పోర్టల్‌లో పేజీలు సరిగ్గా కనిపించకపోవడం, బ్లర్‌గా మారడం, కొన్ని పేజీలు పూర్తిగా మాయమవడం వంటి దారుణాలు జరిగాయన్నారు. ఇవన్నీ పొరపాట్లు కావని, ఒక వెండర్‌కు లాభం చేకూర్చడం కోసం చేసిన పక్కా ప్లాన్ అని, ఇది ముమ్మాటికీ పెద్ద మోసమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మౌనంపై విమర్శలు
దాదాపు 18.5 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసిన ఈ భారీ స్కామ్‌పై ప్రధానమంత్రి మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎథికల్ హ్యాకర్ బయటపెట్టిన లోపాలు
మరోవైపు 19 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ నిసర్గ అధికారి కూడా ఈ డిజిటల్ మూల్యాంకన పోర్టల్‌లోని భద్రతా లోపాలను స్క్రీన్ షాట్లతో సహా బయటపెట్టారు. ఇంటర్నెట్ ఉన్న ఎవరైనా విద్యార్థుల ఆన్సర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నిరూపించారు. అలాగే స్కాన్ చేసిన పేజీలపై మొబైల్ ఫోన్ల నీడలు, మడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సార్థక్ సిద్ధాంత్ కూడా ఆధారాలను బయటపెట్టారు. ప్రొఫెషనల్ స్కానర్లు వాడితే ఇలాంటి నీడలు రావడం అసాధ్యమని బోర్డును ప్రశ్నించారు.
