South Coast Railway Zone: నెరవేరిన దశాబ్దాల నాటి కల.. ఏపీ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభం

దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నంలో జోన్ కార్యకలాపాలను వీఎంఆర్‌డీఏకు చెందిన ‘డెక్‌’ భవనంలో ప్రారంభించారు. జోన్‌కు కేటాయించిన జనరల్ మేనేజర్, ఇతర అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు విశాఖలోనే ఉన్నారు. వాస్తవానికి మే 5న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా.. జీఎంతో పాటుగా అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది విశాఖ వచ్చి కార్యాలయం నుంచి విధుల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది.. ఎట్టకేలకు […]

Published By: HashtagU Telugu Desk
A Decades-Old Dream Realized: South Coast Railway Zone Launched, Headquartered in AP.

A Decades-Old Dream Realized: South Coast Railway Zone Launched, Headquartered in AP.

దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నంలో జోన్ కార్యకలాపాలను వీఎంఆర్‌డీఏకు చెందిన ‘డెక్‌’ భవనంలో ప్రారంభించారు. జోన్‌కు కేటాయించిన జనరల్ మేనేజర్, ఇతర అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు విశాఖలోనే ఉన్నారు. వాస్తవానికి మే 5న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా.. జీఎంతో పాటుగా అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది విశాఖ వచ్చి కార్యాలయం నుంచి విధుల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది.. ఎట్టకేలకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభమైంది. విశాఖపట్నం కేంద్రంగా ఇవాళ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయాన్ని నగరంలోని వీఎంఆర్‌డీఏ డెక్‌ భవనంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖ డివిజనల్‌ రైల్వే అధికారులతో.. హెచ్‌వోడీలతో జీఎం సందీప్‌ మాథుర్ సమావేశం నిర్వహించారు. మే 5న రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేయగా.. నేటి నుంచి విశాఖ కేంద్రం రైల్వే జోన్‌కు సంబంధించిన మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్, ప్రధాన పరిపాలన వ్యవహారాలన్నీ నిర్వహించనున్నారు. ఇప్పటికే జీఎంను, సీపీఆర్వోను నియమించారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి విశాఖపట్నం, గుంతకల్లు, గుంటూరు, విజయవాడ అనే నాలుగు డివిజన్లు కలిసి పని చేస్తున్నాయి. అంతేకాదు, ఏకంగా 130 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ కనుమరుగైంది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కానుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి.. దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు మరియు తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో ఉన్న వాల్తేరు డివిజన్‌లోని ఒక భాగాన్ని కలిపి ఏర్పాటు చేశారు. వాస్తవానికి 2019లోనే రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. 2020-2021 బడ్జెట్‌లో కొత్త రైల్వే జోన్ ఆఫీస్, ఇతర భవనాల కోసం రూ.170 కోట్లు కేటాయించారు. కానీ గత ఐదేళ్లుగా పనులు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు అప్పగించడంతో జోన్ పనులు ఊపందుకున్నాయి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ఏప్రిల్ 28న వచ్చిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే జోన్‌పై కీలక ప్రకటన చేశారు. మే 5న గెజిట్ నోటిఫికేషన్ వెలువడగా, ఇవాళ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి. దశాబ్దాల మన కల నెరవేరుతోంది. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుంది. కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక వృద్ధికి బాటలు వేస్తుంది. మన రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ఇది ఒక కీలక మైలురాయి. ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారికి రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.

రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమైనా.. ఉద్యోగులు పాటించాల్సిన నియమ నిబంధనలపై ఇంకా కసరత్తు జరుగుతోంది. ఆయా జోన్లకు సంబంధించి రైల్వే ఉద్యోగులకు ప్రత్యేకంగా నియమావళి ఉంటుంది.. దానిని ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభమైనా.. నిబంధనలపై క్లారిటీ లేదు. ఉద్యోగులు ఎలాంటి మార్గదర్శకాలు అనుసరించాలో తెలియక అయోమయంలో ఉన్నారు. అయితే మే 30న దక్షిణ కోస్తా జోన్ ఆపరేటింగ్ వింగ్ కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖపట్నం డివిజన్ ప్రస్తుతానికి తూర్పు కోస్తా జోన్ సాధారణ నియమాలు పాటించాలని సూచించారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు దక్షిణమధ్య రైల్వే జోన్ నియమాలు పాటించాలన్నారు. కొత్త మార్గదర్శకాలు వచ్చే వరకు పాతవాటినే కొనసాగించాలన్నారు.

 

  Last Updated: 01 Jun 2026, 01:08 PM IST