Site icon HashtagU Telugu

Pak Vs India : నియంత్రణ రేఖను దాటొచ్చిన పాక్‌ ఆర్మీ.. ఏమైందంటే..

Pakistan Army Indian Army Pak Vs India Line Of Control Loc Indian Army Posts Min

Pak Vs India : భారత్‌-పాక్ సరిహద్దు‌ల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లా కృష్ణ ఘాటి సెక్టార్‌‌లో ఉన్న నియంత్రణ రేఖ (LOC) వద్ద నుంచి పాక్‌ ఆర్మీ చొరబాటుకు తెగబడింది. దీంతో అక్కడ మందుపాతర పేలింది. ఆ వెంటనే పాక్‌ సైన్యం కాల్పులు జరిపింది.  దీనికి భారత ఆర్మీ దీటుగా బదులిచ్చింది.  భారత దళాలు జరిపిన ప్రతీకార కాల్పుల్లో ఇద్దరు పాకిస్తాన్ సైనికులు మరణించారని తెలుస్తోంది. చనిపోయిన పాక్ సైనికులను  చారికోట్ హవేలి నివాసి చౌదరి నజాకత్ అలీ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని నాక్యాల్ కోట్లికి చెందిన నసీర్ అహ్మద్‌గా గుర్తించారు. ఈ ఘటన ఏప్రిల్ 1న మధ్యాహ్నం 1.30 గంటలకు చోటుచేసుకుంది. ప్రాణనష్టం, గాయపడిన వారి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఈవిధంగా చొరబాటుకు పాల్పడటం ద్వారా పాక్ సైన్యం(Pak Vs India) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జమ్మూకు చెందిన రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బార్త్వాల్ బుధవారం తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి శాంతి కోసం 2021లో భారత్, పాక్ సైన్యాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) మధ్య  ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు.

Also Read :Vijayasai Reddy : వచ్చే వారమే బీజేపీలోకి విజయసాయి రెడ్డి ? కారణం అదేనా ?

కథువాలో ఉగ్రవాదుల ఏరివేత

జమ్మూకశ్మీరులోని కథువాలో భారత సైన్యం ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం చొరబాటుకు యత్నించినట్లు తెలుస్తోంది. కథువాలో భారత భద్రతా దళాలు ఇప్పటివరకు ఇద్దరు పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులను హతమార్చింది. సరిహద్దు జిల్లాలోని పంజ్‌తిర్తి ప్రాంతంలో దాక్కున్న మరో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ఎన్‌కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఈ ఏడాది జనవరి నుంచే.. 

వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచే ఎల్‌ఓసీ వద్ద శాంతిని భగ్నం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. మార్చి 12న రాజౌరి జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లోని కల్సియన్ ప్రాంతంలో ఎల్‌ఓసీపై పాకిస్తాన్ జవాన్ కాల్పుల్లో ఒక భారత సైనికుడు గాయపడ్డాడు. ఫిబ్రవరి 11న జమ్మూ ప్రాంతంలోని అఖ్నూర్ సెక్టార్‌లో ఉగ్రవాదులు జరిపిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) దాడిలో కెప్టెన్ కరమ్‌జిత్ సింగ్ బక్షి సహా ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించారు. ఫిబ్రవరి 10, 14 తేదీలలో రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ఎల్‌ఓసీ వెంబడి జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనలలో ఇద్దరు సైనిక సిబ్బంది గాయపడ్డారు.  ఫిబ్రవరి మొదటి వారంలో పూంచ్‌లో జరిగిన వేర్వేరు ల్యాండ్‌మైన్ పేలుళ్లలో మరో ఇద్దరు సైనిక సిబ్బంది గాయపడ్డారు.

Also Read :Cyber Crimes: ఏపీలో ‘సైబర్’ టెర్రర్.. 8 నెలల్లో రూ.600 కోట్లు లూటీ