India Attack : భారత సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, శతఘ్నులతో పాకిస్తాన్ ఆర్మీ ఎటాక్ చేసింది. దీనికి ప్రతిగా భారత వాయుసేన పాక్‌పై విరుచుకుపడింది. ఆ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. ఈవిషయాన్ని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరిఫ్ చౌదురి ప్రకటించారు. పాక్ సైనిక హెడ్‌క్వార్టర్ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్‌ఖాన్, చక్వాల్‌లో ఉన్న మురీద్, జాంగ్ జిల్లా షోర్కోట్‌లో ఉన్న రఫీఖీ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసిందని వెల్లడించారు. భారత్ దాడులు జరిపిన అనంతరం అక్కడ భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. మరో అప్‌డేట్ ఏమిటంటే.. జమ్మూలోని నియంత్రణ రేఖకు అవతలి వైపున ఉన్న పాకిస్తాన్ ఆర్మీ పోస్ట్ వద్ద ట్యూబ్ డ్రోన్లను ప్రయోగించే లాంచ్ ప్యాడ్ ఉంది. దీన్ని భారత భద్రతా దళాలు ధ్వంసం చేశాయి.
Also Read :Operation Sindoor Movie: ‘ఆపరేషన్ సిందూర్’ మూవీ.. పోస్టర్ వచ్చేసింది
ప్రతిస్పందిస్తామన్న పాక్
ఈ దాడులకు సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. అంతేకాదు.. భారత్‌పై తాము చేస్తున్న దాడులకు ‘ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్’ (బలమైన పునాది) అనే పేరును పాకిస్తాన్ పెట్టింది. పాకిస్తాన్‌లోని మూడు వైమానిక స్థావరాలపై దాడులకు సంబంధించి ఇప్పటివరకు భారత వాయుసేన కానీ, సైన్యం కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. ఈరోజు (శనివారం) ఉదయం 10 గంటలకు భారత సైన్యం(India Attack) పెట్టే ప్రెస్‌మీట్‌లో వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
Also Read :India Attack : పాక్ వైమానిక స్థావరాలపై భారత్ ఎటాక్
ఈరోజు తెల్లవారుజామున ఏమైందంటే..
భారత్, పాక్‌ల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం కాస్త ప్రశాంతత నెలకొంది. అయితే సాయంత్రం తర్వాత మరోసారి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి పాక్ ఆర్మీ డ్రోన్లను పంపింది. ఆ డ్రోన్ల ద్వారా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతీపొరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంది. వాటిని భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసింది. ఈరోజు (శనివారం) తెల్లవారుజాము నుంచి బార్డర్‌లో పాకిస్తాన్ ఆర్మీ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. శ్రీనగర్ ఎయిర్ బేస్‌పై పాక్ ఆర్మీ డ్రోన్లతో దాడి చేయగా, భారత సైన్యం తిప్పికొట్టింది. శ్రీనగర్, పఠాన్ కోట్ ప్రాంతాల్లో ఈరోజు ఉదయం కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి నుంచే భారత సరిహద్దు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల బాంబుపేలుళ్లు వినిపించడంతో, అప్పటికప్పుడు విద్యుత్తు సరఫరా నిలిపివేసి ‘బ్లాకౌట్’ పాటించారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అత్యంత దారుణ స్థితిలో ఉంది. అక్కడి ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారు. భారత్‌తో పోలిస్తే పాకిస్తాన్ ప్రజల తలసరి ఆదాయం చాలా తక్కువ. అయినా చైనా, టర్కీ దేశాలు అందిస్తున్న ఆయుధాల దన్నుతోనే పాకిస్తాన్ రెచ్చిపోతోందని తెలుస్తోంది.