Sabarmati Report : ‘ది సబర్మతీ రిపోర్ట్’ మూవీ ఇప్పుడు యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీని గురించి గతంలో మాట్లాడారు. స్టోరీ బాగుందని కితాబిచ్చారు. నాటి నుంచి ఈ మూవీలోని స్టోరీపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఇవాళ సాయంత్రం కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ‘ది సబర్మతీ రిపోర్ట్’ మూవీని పార్లమెంటు ప్రాంగణంలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధాని మోడీ, ఇతర నేతలతో కలిసి చూడనున్నారు.
Also Read :War and Business : 100 కంపెనీలకు కలిసొచ్చిన యుద్ధాలు.. ఏడాదిలో రూ.53 లక్షల కోట్ల బిజినెస్
- ‘ది సబర్మతీ రిపోర్ట్’(Sabarmati Report) మూవీ నవంబరు 15న రిలీజ్ అయింది.
- 2002 సంవత్సరం ఫిబ్రవరి 27న గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు జరిగాయి. పంచమహల్ జిల్లాలోని గోద్రా రైల్వే స్టేషనులో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులోని కొన్ని బోగీలకు దుండగులు నిప్పుపెట్టారు.
- ఆ ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
- ఈ ఘటన ఎలా జరిగింది అనే అంశాన్ని హైలైట్ చేస్తూ బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీని తీశారు.
- ఈ మూవీలో విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలకపాత్ర పోషించారు.
- ఈ మూవీపై ఇటీవలే ప్రధాని మోడీ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘‘కట్టు కథలు కలకాలం చెల్లవు. అవి పరిమిత కాలం పాటే కొనసాగుతాయి. గోద్రా ఘటనకు సంబంధించిన వాస్తవాలను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ది సబర్మతీ రిపోర్ట్ మూవీలో చూపించారు. వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు.
- ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే ది సబర్మతీ రిపోర్ట్ మూవీకి పన్నులు మినహాయించాయి. తద్వారా ఆ సినిమాకు మంచి ఆర్థిక ప్రయోజనమే చేకూరింది.
- మొత్తం మీద బీజేపీకి రాజకీయంగా ప్లస్ పాయింట్‌గా మారే కాన్సెప్టులతో వచ్చే సినిమాలకు మంచి టైం నడుస్తోంది.