టీవీకే చీఫ్ విజయ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య మరో పోలికను తెచ్చారు మాజీ మంత్రి రోజా. శనివారం ఆమె తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయ్.. వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్నారని రోజా అన్నారు. తమిళనాడు ఎన్నికల సమయం నుంచి జరుగుతున్న ఘటనలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాటలోనే నడుస్తున్నారంటూ వైసీపీ నేతలు గత కొన్ని రోజులుగా చెబుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి వైసీపీ శ్రేణులు కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేస్తూ ఉన్నాయి. ఇక వైఎస్ జగన్ ఫోటో కారణంగా విజయ్ గెలిచాడనే పోస్టులు లేకపోలేదు. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తరహాలోనే.. తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ సింగిల్గా పోటీ చేసి విజయం సాధించారని మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా అన్నారు. జగన్ తరహాలోనే విజయ్ సింగిల్గా బరిలోకి దిగడానికే మొగ్గు చూపారని.. ప్రజలు కూడా విజయ్ను ఆశీర్వదించారని అన్నారు. తాజాగా వైఎస్ జగన్, విజయ్ మధ్య మరో పోలిక తెచ్చారు రోజా.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్‌తో ఉన్న ఫోటోను విజయ్ బహిరంగంగా ప్రదర్శించారన్న రోజా.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటూ పక్క రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఫోటో పట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. కానీ జగన్, తాను ఉన్న ఫోటోను చూపించడం ద్వారా జగన్ లాంటి నాయకత్వం, పాలన అందిస్తానని విజయ్ చెప్పకనే చెప్పారని రోజా అభిప్రాయపడ్డారు. విజయ్ డ్రెస్సింగ్ కూడా జగన్ మాదిరిగానే ఉంటుందని.. డ్రెస్ కోడ్ విషయంలోనూ విజయ్ జగన్‌ను ఫాలో అవుతున్నారని అన్నారు. డ్రెస్సింగ్, బహిరంగ సభలలో మాట్లాడే తీరును గమనిస్తే విజయ్.. జగన్‌ను అనుసరిస్తున్న విషయం అందరికీ తెలుస్తుందని మాజీ మంత్రి రోజా అన్నారు.
తమిళనాడు ప్రజలు విజయ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని.. కావున గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చి, అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశమిస్తే బాగుంటుందని రోజా అభిప్రాయపడ్డారు. మరోవైపు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడిని రోజా శనివారం దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా గంగమ్మను దర్శించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలతో పాటు తమిళ రాజకీయాలపై రోజా స్పందించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏపీలో ఎవరి బలం ఏమిటో తెలుస్తుందన్నారు రోజా. వైసీపీ వైపు ప్రజలు ఉన్నారనే సంగతి అర్థమవుతుందన్నారు.
