Andhra Paper Mill Lokout తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఆంధ్ర పేపర్ మిల్లు యూనిట్‌లో యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతలో యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. పర్మినెంట్ ఉద్యోగులు రావద్దంటూ యాజమాన్యం మెసేజ్‌లు పంపింది. అయితే, ఈ రోజు కార్మికులతో యాజమాన్యం చర్చలు జరిపే అవకాశం ఉంది అంటున్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి రంగంలోకి దిగి కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కార్మికులతో యాజమాన్యం చర్చలు జరపనుంది.
తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఉన్న ఆంధ్ర పేపర్ మిల్లు లాకౌట్ ప్రకటించింది. పేపర్ మిల్లులో పనిచేసే పర్మినెంట్ ఉద్యోగులు ఎవరూ విధులకు రావొద్దని యాజమాన్యం మెసేజ్‌లు పంపింది. ఉన్నట్టుండి పేపర్ మిల్లుకు లాకౌట్ ప్రకటించడంతో కార్మికులు, వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. ఇంతలో యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది.
గత మూడేళ్లుగా ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యం కొత్త అగ్రిమెంట్లు చేయకుండా మోసం చేస్తోందని, యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా గత ఐదు రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇంతలో పర్మినెంట్ ఉద్యోగులను కూడా విధులకు రావొద్దంటూ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. మిల్లు దగ్గర నోటీసు కూడా అంటించింది. కార్మికుల సమ్మెకు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంఘీభావం తెలిపారు. ఈ రోజు యాజమాన్యంతో చర్చిద్దామని కార్మికులకు ఆయన హామీ ఇచ్చారు. కొత్త అగ్రిమెంట్లు సహా మిగిలిన డిమాండ్లపై యాజమాన్యంతో చర్చించనున్నారు.
కార్మికశాఖ అధికారులు కూడా ఇవాళ మిల్లు దగ్గరకు వస్తున్నట్లు తెలుస్తోంది. కార్మిక దినోత్సవం రోజు కార్మికుల్ని అణిచివేసేందుకు పేపర్ మిల్లు పరిశ్రమ లాకౌట్ ప్రకటించడం దారుణమని సీఐటీయూ నేతలు అన్నారు. 1964లో ఆంధ్రా పేపర్ మిల్లును స్థాపించారు. ప్రధానంగా రైటింగ్ పేపర్, ప్రింటింగ్ పేపర్, కాపీయర్ పేపర్లు తయారవుతాయి. ఈ యూనిట్‌ను రూ.3,400 కోట్ల పెట్టుబడితో ఆధునీకరించాలని నిర్ణయించారు. కానీ ఇంతలోనే లాకౌట్ ప్రకటించడం సంచలనంగా మారింది.
ఇటీవల కాకినాడలో ఉన్న ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్లాంట్ కూడా మూతపడింది. భారీగా నష్టాలు రావడంతో మూసివేయాలని కంపెనీ బోర్డు మార్చి 31న నిర్ణయం తీసుకుంది. వెంటనే ప్లాంట్‌ను మూసివేశారు. దాదాపు రూ.1406 కోట్లు నష్టాలు పేరుకుపోవడంతో, ప్లాంట్ నిర్వహణ లాభదాయకం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మికులకు సమాచారం ఇచ్చారు. అలాగే ప్లాంట్ మూసివేస్తున్నట్లు కలెక్టర్, పరిశ్రమలు, ఇతర శాఖలకు సమాచారం ఇచ్చారు.
