ఏపీలో ఇంధన కొరతపై నిరసన తెలుపుతూ వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి చేసిన వినూత్న ప్రయోగం ఇప్పుడు జంతు హింస వివాదానికి దారితీసింది. రాజకీయ నిరసనల కోసం మూగజీవాలను హింసించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ యాంకర్ రష్మి కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివాదం వివరాల్లోకి వెళితే… తిరుపతిలో పెట్రోల్, డీజిల్ కొరతను నిరసిస్తూ ఒక ఆటోను ఎడ్లబండిపై ఎక్కించి నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే, కేవలం ఆటోనే కాకుండా, అందులో మనుషులు కూర్చోవడం, ఎడ్లబండి పైన కూడా జనం ఉండటంతో ఆ భారాన్ని మోయలేక ఎద్దు తీవ్రంగా ఇబ్బంది పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రాజకీయ ప్రయోజనాల కోసం ఎద్దులను అంతలా హింసించాలా? అంటూ నెటిజన్లు, టీడీపీ మద్దతుదారులు, జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.
జంతు ప్రేమికురాలిగా పేరున్న నటి, యాంకర్ రష్మి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. “ఆ ఎద్దు పడ్డ ఆవేదన ఈ మనుషులపై వెయ్యి రెట్లు ఎక్కువగా పడాలి” అంటూ ఆమె తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. పెటా, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ ఘటనపై తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇటీవలే 40 హస్కీ కుక్కలను చంపేసిన ఘటనను కూడా గుర్తు చేస్తూ, మూగజీవాల పట్ల జరుగుతున్న క్రూరత్వానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆమె ప్రశ్నించారు.
