పవన్ కళ్యాణ్ ఫోటో వివాదం..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

"డిప్యూటీ సీఎం" అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదని, కేవలం రాజకీయ ప్రాధాన్యత కోసం సృష్టించుకున్నదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఇలాంటి పదవిలో ఉన్న వ్యక్తి ఫోటోలను ప్రజాధనంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించడం సుప్రీంకోర్టు

Published By: HashtagU Telugu Desk
Deputy CM Pawan Kalyan

Deputy CM Pawan Kalyan

విజయవాడకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కొండలరావు, ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు సచివాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. “డిప్యూటీ సీఎం” అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదని, కేవలం రాజకీయ ప్రాధాన్యత కోసం సృష్టించుకున్నదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఇలాంటి పదవిలో ఉన్న వ్యక్తి ఫోటోలను ప్రజాధనంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించడం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధమని, ఇది రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేయడంతో, ఆ తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు.

జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియా, జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై తీవ్రంగా స్పందించింది. “ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటో ఉంటే మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి?” అని పిటిషనర్‌ను నేరుగా ప్రశ్నించింది. వ్యక్తిగత లేదా రాజకీయ కారణాలతో న్యాయస్థానాలను వేదికగా చేసుకుని ఇష్యూస్ సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నించవద్దని ధర్మాసనం మందలించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను (PIL) సమాజ హితం కోసం వాడాలి తప్ప, ఇలాంటి అంశాల కోసం కాదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీనితో పవన్ కళ్యాణ్ ఫోటోల ఏర్పాటుకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తుల ఫోటోలను ప్రదర్శించడం అనేది పరిపాలనాపరమైన నిర్ణయమని, ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టమైంది. గతంలో హైకోర్టు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతూ.. ఫోటోల ఏర్పాటుపై ఎక్కడా నిషేధం లేదని, ఇది రాజకీయ ప్రేరేపిత పిటిషన్ అని తేల్చి చెప్పింది. తాజా సుప్రీంకోర్టు తీర్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్లయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో ఉండటం ఇప్పుడు అధికారికంగా చెల్లుబాటు అవుతుంది.

  Last Updated: 11 Feb 2026, 11:35 AM IST