మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయన కిడ్నీ సంబంధమైన సమస్యతో బాధపడుతుండగా.. రెండు రోజులుగా డయాలసిస్ చేస్తున్నారు.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరా తీశారు. ముద్రగడ పద్మనాభం ఇటీవల శ్వాస సమస్యలు, యూరినరీ ఇన్‌ఫెక్షన్ ఇతర సమస్యలతో ఇబ్బందిపడ్డారు. కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందారు. అయితే ఆయన మళ్లీ అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు తెలుస్తోంది.
ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు ఆయనకు 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారంటున్నారు. ముద్రగడ పద్మనాభం అనారోగ్య కారణాలతో రామచంద్రాపురంలో నిర్వహించే వైఎస్సార్‌సీపీ కాపు నేతల సమావేశానికి దూరంగా ఉంటారని చెబుతున్నారు. ముద్రగడ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆకాంక్షించారు.
ముద్రగడ పద్మనాభం గతేడాది జులై నెలలో కూడా అస్వస్థతకు గురయ్యారు. ముందు ఆయనకు కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. కాకినాడ వైద్యుల సూచన మేరకు ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొంతకాలం ట్రీట్మెంట్ తర్వాత ముద్రగడ పద్మనాభం కోలుకున్నారు.
