నంద్యాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం ఘటన వెనుక వైసీపీ కుట్ర ఉందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.మంగళగిరి కేంద్రకార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,, విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్యకు వైసీపీతో సంబంధాలు ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. జంబులయ్య భార్యకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ (సీఆర్‌పీ) ఉద్యోగం కల్పించారని, ఆ నియామకానికి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే సిఫారసు చేశారని మంత్రి వెల్లడించారు. జంబులయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తాము వైసీపీ కార్యకర్తలమని చెప్పిన వీడియో వాంగ్మూలాలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. వైఎస్ విగ్రహం తల భాగాన్ని ధ్వంసం చేయించి, దానికి తెలుగుదేశం పార్టీని బాధ్యులుగా చూపించే ప్రయత్నం జరిగిందని మంత్రి ఆరోపించారు. ఘటన వెనుక ఉన్న వాస్తవాలు బయటపడటంతో వైసీపీ ఇబ్బందుల్లో పడిందన్నారు. మనుషుల ప్రాణాలు తీసిన చరిత్ర ఉన్న వారికి విగ్రహాల తలలు ధ్వంసం చేయడం పెద్ద విషయం కాదని.. విగ్రహాన్ని ధ్వంసం చేయించడం, ఆ తర్వాత అదే అంశంపై ధర్నాలు చేయడం వైసీపీ రాజకీయ సంస్కృతికి నిదర్శనమన్నారు. శవం, సింపతీ, స్టాట్యూ రాజకీయాలు చేయడం వైసీపీ విధానమని.. వైఎస్ మరణానంతరం రాష్ట్రవ్యాప్తంగా విగ్రహాలు ఏర్పాటు చేసి రాజకీయ ప్రయోజనాలు పొందారని అనగాని ఆరోపించారు. ఇప్పుడు అదే విగ్రహాల ధ్వంసాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీకి చెందిన కీలక నేతల అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇటువంటి ఘటనలను ఉపయోగించుకుంటున్నారని మంత్రి ఆరోపించారు. ముఖ్యంగా జగన్ వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన ఆస్తులు, బినామీ వ్యవహారాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తరహా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తుండటం, ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండటం వైసీపీకి ఇష్టం లేదని మంత్రి విమర్శించారు. డీఎస్సీ నియామకాలు విజయవంతంగా పూర్తవడం, కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా, వాటిని అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం, అనిశ్చితి సృష్టించడం వైసీపీ రాజకీయ విధానమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అసత్య ప్రచారాలు, కుట్రలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
