CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

రాష్ట్రంలో సుపరిపాలనను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం సభలో ప్రసంగించిన ఆయన.. ఇటీవల జరిగిన పలు సంఘటనలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం రాత్రింబవళ్లు కృషి చేస్తుంటే, గత పాలకులు విధ్వంసక రాజకీయాలను కొనసాగిస్తున్నారని చంద్రబాబు అన్నారు. సుపరిపాలనను వెనక్కి లాగేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని.. అందుకే ఆ పార్టీని “గొడ్డలి […]

Published By: HashtagU Telugu Desk
AP CM Chandrababu

AP CM Chandrababu

రాష్ట్రంలో సుపరిపాలనను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం సభలో ప్రసంగించిన ఆయన.. ఇటీవల జరిగిన పలు సంఘటనలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం రాత్రింబవళ్లు కృషి చేస్తుంటే, గత పాలకులు విధ్వంసక రాజకీయాలను కొనసాగిస్తున్నారని చంద్రబాబు అన్నారు. సుపరిపాలనను వెనక్కి లాగేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని.. అందుకే ఆ పార్టీని “గొడ్డలి పార్టీ”గా అభివర్ణిస్తున్నామని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 241 న్యాయపరమైన కేసులను ఎదుర్కొని డీఎస్సీ నియామకాలను విజయవంతంగా పూర్తి చేసిందని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించామని,.. కంప్యూటర్ ఆధారిత ఎంపిక విధానంతో పాటు వేలాది ప్రశ్నలు, వివిధ ప్రశ్నాపత్రాల వ్యవస్థను అమలు చేశామని చెప్పారు. అయినప్పటికీ దీనిని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్షం ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల ద్వారా అనేక కేసుల్లో వాస్తవాలను బయటపెట్టగలిగామని తెలిపారు. తిరుమలలోని కౌస్తుభం అతిథి గృహం వద్ద మద్యం సీసాలు ఉంచి అపవిత్రం చేసే ప్రయత్నాలు జరిగాయని, అలాంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాల వ్యవస్థను మరింత బలోపేతం చేసి కుట్రలకు పాల్పడే వారిని గుర్తిస్తామని చెప్పారు. నంద్యాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం ఘటనలో నిందితుడిని 20 నిమిషాల్లోనే పోలీసులు అరెస్టు చేశారని సీఎం పేర్కొన్నారు. ఆ ఘటనలో వైసీపీ కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఆరోపించారు. రాజకీయాల్లో విలువలు, నైతికత చాలా ముఖ్యమని చంద్రబాబు అన్నారు. హత్యలు, కుట్రలు, అసత్య ప్రచారాలతో రాజకీయాలు చేయడం సమాజానికి హానికరమని పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, యువత భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.

  Last Updated: 01 Jun 2026, 04:03 PM IST