ఏపీలో ప్రభుత్వం స్కూల్, ఇంటర్ విద్యార్థుల తల్లులకు ‘తల్లికి వందనం’ పథకం కింద డబ్బులు ఇస్తోంది. ఈ ఏడాది కూడా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ముందుగానే అర్హుల జాబితాలను సిద్ధం చేసింది. విద్యార్థులు అర్హుల జాబితాను చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రత్యేక వెబ్‌పోర్టల్ సాయంతో తల్లికి వందనం పథకానికి అర్హులా కాదా, అసలు పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఏటా స్కూల్ విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 15 వేల చొప్పున ఇస్తున్నారు. ఇందులో రూ. 13 వేలు విద్యార్థుల తల్లుల అకౌంట్‌లలో జమ చేస్తుండగా, మరో రూ. 2 వేలు మాత్రం స్కూల్ నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా విద్యార్థులకు ఈ డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులో కాదో, పథకం వర్తిస్తుందో లేదోనని అందరిలో సందేహం ఉంది. ఒకవేళ అర్హులమైతే ఆ సమాచారం ఎలా తెలుసుకోవాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అర్హులో కాదో తెలుసుకోవడానికి ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదు, వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వెబ్ పోర్టల్ సాయంతో తల్లికి వందనం పథకానికి అర్హులో కాదో వివరాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘స్కీమ్ ఎలిజిబిలిటీ’ ఆప్షన్ క్లిక్ చేయగానే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ లబ్ధిదారుల ఆధార్ నంబరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పథకం, ఏ సంవత్సరమో సెలెక్ట్ చేసిన తర్వాత ‘గెట్ డిటైల్స్’ ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నంబరుతో పాటు కింద ఉండే క్యాప్చా ఎంటర్ చేస్తే లబ్ధిదారుల సమాచారం వస్తుంది. ఆ వివరాలను సరిచూసుకుని.. ఒకవేళ ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ ఏవైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించాలని నర్సీపట్నం సూచిస్తోంది. ఏపీ ప్రభుత్వం సాంకేతిక సమస్యలతో పాటుగా మ్యాపింగ్ ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. విద్యార్థుల తల్లుల బ్యాంకు అకౌంట్, మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. అలాగే కుటుంబ సభ్యుల మ్యాపింగ్ పూర్తయితేనే తల్లికి వందనం డబ్బులు అందుతాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు దగ్గరలోని సచివాలయానికి వెళ్తే అక్కడి సిబ్బంది పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారు. ఒకవేళ విద్యార్థుల తల్లుల బ్యాంకు అకౌంట్, మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయకపోతే వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
