Earthquakes: సోమవారం సాయంత్రం తెలంగాణలోని పలుచోట్ల భూకంపం రాగా.. ఇవాళ ఉదయం 9.54 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో పలుచోట్ల భూప్రకంపనలు సంభవించాయి. ప్రకాశం జిల్లా పరిధిలోని దర్శి, పొదిలి, కురిచేడు, ముండ్లమూరులలో భూమి కంపించిందని తెలిసింది. కొత్తూరులోని రాజు ఆస్పత్రి వీధి, బ్యాంకు కాలనీ, ఇస్లాంపేటలలోనూ ప్రకంపనలు వచ్చాయి. మంగళవారం ఉదయం 5సెకన్ల పాటు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు. దీంతో భయపడి జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత ఏడాది కూడా ప్రకాశం జిల్లాలోని దర్శి, ముండ్లమూరు, తాళ్లూరులలో భూమి కంపించింది. సోమవారం సాయంత్రం తెలంగాణలోని కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడ, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 3.8 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, జన్నారం, లక్సెట్టిపేటలలోనూ భూమి కంపించింది. రెండుసార్లు భూమి తీవ్రంగా కంపించిందని స్థానికులు తెలిపారు. కరీంనగర్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో భవనాలు, ఇండ్లు కంపించాయి.
Also Read :Ambani Vs Trump: హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ట్రంప్‌తో అంబానీ ఢీ.. వాట్స్ నెక్ట్స్ ?
తెలంగాణకు రిస్క్ ఎందుకు పెరిగింది ?
భూప్రకంపనలు అనేవి గత రెండేళ్ల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో(Earthquakes) ఎక్కువ సంఖ్యలో సంభవించాయి. దీంతో తెలంగాణ, ఏపీ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రత్యేకించి ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్న జిల్లాలు, ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో భూప్రకంపనల తీవ్రత ఎక్కువగా కనిపించింది. అంటే తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు ప్రాంతాలకు భూకంపాల ముప్పు ఎక్కువగా ఉందనే విషయం క్లియర్ అవుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల విషయానికొస్తే.. ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతోంది. సింగరేణి కాలరీస్ వంటివి ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. దీంతోపాటు ఈ జిల్లాల్లో భూగర్భ జలాల వినియోగం అతిగా జరుగుతోంది. ఇవన్నీ ప్రతికూలంగా పరిణమించి భూప్రకంపనలకు కారణమవుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.
Also Read :APPSC Irregularities : ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో ధాత్రి మధు అరెస్టు.. ఏమిటీ కేసు ?
కోస్తాంధ్రలో రిస్క్.. ఎక్కడంటే ?
ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతం విషయానికొస్తే.. అది సముద్ర తీరంలో ఉంది. సముద్ర గర్భంలో చోటుచేసుకున్న ప్రతికూల పరిణామాల ప్రభావం రానున్న కాలంలో కోస్తాంధ్ర జిల్లాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రత్యేకించి కోస్తాంధ్ర ప్రాంతంలోని ప్రకాశం, కాకినాడ, విశాఖపట్నంలకు భూకంపాల ముప్పు ఎక్కువ అని నిపుణులు అంటున్నారు. మన దేశాన్ని మొత్తం నాలుగు భూకంప మండలాలుగా డివైడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తక్కువ ముప్పు ఉన్న జోన్ 2లో ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలు జోన్ 3లో కూడా ఉన్నాయి. అంటే ఆయా చోట్ల మధ్యస్తంగా భూకంపాలు వచ్చే రిస్క్ ఉంది. భూగర్భంలో ఉండే టెక్టానిక్ ప్లేట్లు తమను తాము సర్దుబాటు చేసుకునేందుకు కదులుతుంటాయి. ఈక్రమంలోనే అవి కదిలిన ప్రాంతాల్లో భూమి కంపిస్తుంటుంది.