ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు, పోక చెక్క వంటి ఉద్యాన పంటల ద్వారా లభించే పీచు, నార, ఫైబర్‌కు విలువ జోడించి రైతులకు అదనపు ఆదాయం కల్పించే అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. అరటి కాండం నుంచి పీచు వెలికితీసే కేంద్రాలను కడప, అనంతపురం, నంద్యాల, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కోరారు.
కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమలను బలోపేతం చేయడానికి మెకనైజ్డ్ హస్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, కాయిర్ జియో టెక్స్‌టైల్స్ పరిశ్రమల స్థాపనకు కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తీరప్రాంతాల్లో నేల కోత నివారణ, గట్ల బలోపేతానికి కాయిర్ ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అదేవిధంగా కుప్పంలో PM MITRA పార్క్ ఏర్పాటు చేయాలని, అమరావతిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) స్థాపనకు రూ.280 కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. నిఫ్ట్ కోసం ఇప్పటికే అమరావతిలో 10 ఎకరాల భూమిని కేటాయించినట్లు వివరించారు. మంగళగిరిలో రూ.22.36 కోట్లతో చేనేత పార్కు, అమరావతిలో చేనేత-హస్తకళల మ్యూజియం ఏర్పాటు చేయాలని కూడా సీఎం ప్రతిపాదించారు. అలాగే ఏపీని నేషనల్ న్యూ ఏజ్ ఫైబర్ మిషన్ కింద ప్రాధాన్య రాష్ట్రంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, జౌళి రంగ అభివృద్ధికి కేంద్రం తరఫున ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
