Tirumala Hills: ప్రస్తుతం డ్రోన్లు కలవరపెడుతున్నాయి. చిన్న సైజులోనే ఉన్నా.. అవి భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఉగ్రవాద శక్తులు డ్రోన్లతో భారత్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రాలను లక్ష్యంగా చేసుకునే పెను ముప్పు కూడా పొంచి ఉంది. హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల కొండలపై గతంలో చాలాసార్లు డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తిరుమలలో గగనతల భద్రతకు ఎవరూ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. యాంటీ డ్రోన్ వ్యవస్థను త్వరలోనే తిరుమలలో అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. తిరుమలపై విమానాలు, డ్రోన్లు ఎగరకుండా ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరుతామన్నారు. ఈమేరకు ఇప్పటికే కేంద్ర మంత్రికి ఆయన లేఖ కూడా రాశారు. త్వరలోనే ఆ దిశగా అనుమతులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. తిరుమల కొండల పరిధిలో ఎవరూ డ్రోన్లను ఎగురవేయలేరు. ఒకవేళ డ్రోన్లను ఎగురవేసినా.. యాంటీ డ్రోన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక వాటిని గగనతలంలోనే నిర్వీర్యం చేసి కూల్చేస్తారు. డీఆర్‌డీఓలో కీలక హోదాల్లో సేవలు అందించిన డాక్టర్ సతీష్‌రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శాస్త్రసాంకేతిక సలహాదారుడిగా ఉన్నారు. ఆయన సూచనల మేరకు తిరుమలలో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు.
Also Read :Pawan Kalyan : ‘ఎస్-400’ను శేషనాగుతో పోలుస్తూ పవన్ ట్వీట్.. క్షణాల్లో వైరల్
వైఎస్సార్ సీపీ హయాంలో ఒట్టి మాటలే..
తిరుమల కొండలపై యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తామని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం(Tirumala Hills) ఊదరగొట్టింది. బెంగళూరులోని భెల్ సంస్థ తయారు చేసిన అత్యాధునిక నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్(ఎన్‌ఏడీఎస్)ను కొంటామని ప్రకటించింది. కోట్లాది రూపాయలు విలువైన ఆ పరికరాన్ని అందించే దాత కోసం సంప్రదిస్తున్నట్లు అప్పట్లో వైఎస్సార్ సీపీ సర్కారు చెప్పింది. కొంతకాలానికి ఆ ప్రతిపాదనను పక్కన పెట్టింది.
భద్రతా లోపం వల్లే ఈ ఘటనలు..
- 2023 జనవరిలో తిరుమలలో ఐఓసీఎల్ గ్యాస్ ప్లాంట్ సర్వేకు వచ్చిన కొందరు డ్రోన్‌తో శ్రీవారి ఆలయాన్ని, మాడ వీధులను చిత్రీకరించారు.
- 2024 జనవరిలో హర్యానాకు చెందిన దినేష్ 53వ మలుపు వద్ద డ్రోన్ ఎగురవేసి శ్రీవారి మోకాలు మెట్టు, నడక మార్గం, అటవీ ప్రాంతాన్ని చిత్రీకరించాడు.
- ఇటీవలే రాజస్థాన్‌కు చెందిన యూట్యూబర్ అన్షుమన్ తరెజా శ్రీవారి ఆలయాన్ని, మాడ వీధులు, అఖిలాండం వరకు చిత్రీకరించాడు.
- పై విధమైన ఘటనలు జరిగినప్పుడల్లా స్థానికులు విజిలెన్స్ అధికారులకు తెలపడం, వారు వచ్చి డ్రోన్లు స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. అదే యాంటీ డ్రోన్ సాంకేతికత అందిపుచ్చుకుంటే డ్రోన్ ఎగిరే అవకాశమే ఉండదు.
- సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తుల బ్యాగులను, వ్యక్తులను అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది, ఎస్పీఎఫ్ సిబ్బంది తనిఖీ చేసి పంపుతారు. అయినా కొందరు భక్తులు తిరుమల కొండలపైకి డ్రోన్‌లను ఎలా తేగలుగుతున్నారు అనే ప్రశ్న తలెత్తుతోంది. భద్రతా లోపం వల్లే డ్రోన్లను తిరుమల కొండలపైకి తేగలుగుతున్నారు.