War Effect On India : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మండుతుండటంతో, దేశీయంగా ఇంధన ధరలు ఏ రేంజ్ లో పెరుగుతాయనే ఆందోళన మొదలైంది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పటికే పెరుగుతూ వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం మరో వారం రోజులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొనడం మార్కెట్లను కలవరపెడుతోంది. పరిస్థితులు ఇలాగే ఉంటే ముడిచమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును తాకుతుందని బార్‌క్లేస్ బ్యాంక్ అంచనా వేసింది. ఒకవేళ ఇదే జరిగితే, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ. 10 వరకు పెరిగే ప్రమాదం ఉంది. భారత్ తన చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నందున, ముడిచమురు ధరలో ప్రతి ఒక డాలర్ పెరుగుదల భారత ప్రభుత్వంపై ఏటా రూ. 13,000 కోట్ల అదనపు భారాన్ని మోపుతుంది.
హార్ముజ్ జలసంధి ముప్పు – రవాణా స్తంభన
భారతదేశానికి ముడిచమురు సరఫరా అయ్యే మార్గాల్లో హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) అత్యంత కీలకమైనది. భారత్ రోజువారీగా వాడే 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురులో దాదాపు 2 మిలియన్ బ్యారెళ్లు ఈ మార్గం గుండానే వస్తుంది. ప్రస్తుతం ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తుండటంతో ఈ సముద్ర మార్గంలో రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ జలసంధి గనక పూర్తిగా మూతపడితే, భారత్‌కు చమురు సరఫరా నిలిచిపోయి తీవ్రమైన ఇంధన సంక్షోభం తలెత్తుతుంది. ప్రస్తుతం మన వద్ద 76 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం ప్రకటించినప్పటికీ, యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ధరల పెరుగుదలను అడ్డుకోవడం కష్టతరం కావచ్చు.
వంట నూనెలు, ఎరువులపై యుద్ధ ప్రభావం
ఈ యుద్ధం కేవలం పెట్రోల్ ధరలకే పరిమితం కాకుండా వంటగదిపై కూడా ప్రభావం చూపుతోంది. భారత్ దిగుమతి చేసుకునే 16 మిలియన్ టన్నుల వంట నూనెల్లో పొద్దుతిరుగుడు నూనె వాటా 20 శాతం ఉంది. ఎర్ర సముద్రం గుండా రవాణా వ్యయాలు పెరగడం వల్ల నూనె ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు, జూన్ నెలలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ఎరువుల కొరత కూడా వేధించే అవకాశం ఉంది. ఎరువుల తయారీలో వాడే సల్ఫర్, సల్ఫ్యూరిక్ యాసిడ్ దిగుమతుల్లో 76 శాతం వాటా ఖతార్, యూఏఈ, ఒమన్‌లదే. యుద్ధం వల్ల ఈ సరఫరా గొలుసు దెబ్బతింటే, ఎరువుల ధరలు పెరిగి రైతాంగంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.
