US Donation Race : ఎన్నికలు అంటేనే.. పైసలతో పని !! అది ఏ దేశమైనా సరే.. ఎన్నికల్లో నీళ్లలా డబ్బులను ఖర్చు పెట్టాల్సిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏ ఏర్పాటు జరగాలన్నా డబ్బులు కావాల్సిందే. అధికార, విపక్షాల క్యాడర్ ఫ్రీగా సేవలు చేయరు కదా !! అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నవంబరు 5న జరగబోతోంది. ఈ ఎన్నికల కోసం అధికార డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బాగానే డబ్బులు ఖర్చు పెట్టారు. ఈ ఖర్చంతా ఆయా పార్టీల తరఫున జరిగింది. విరాళాల ద్వారా సేకరించిన డబ్బునే అమెరికా ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు పెట్టారు. అమెరికాలోని రాజకీయ పార్టీల విరాళాల సేకరణ(US Donation Race) ఎలా ఉంటుంది ? ఈసారి విరాళాల సేకరణలో కమల వర్సెస్ ట్రంప్ పోటీలో గెలిచిందెవరు ? ఈ కథనంలో చూద్దాం..
Also Read :BRS Survey : బీఆర్ఎస్ సీక్రెట్ సర్వే.. సీఎం రేవంత్‌పైనా ప్రశ్నలు అడిగిన గులాబీ పార్టీ
ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విరాళాల సేకరణలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ వెనుకంజలో ఉండిపోయారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు అత్యధికంగా రూ.8,400 కోట్లకుపైగా డొనేషన్స్ వచ్చాయి. ఇందులో సగానికిపైగా (56 శాతం) భారీ విరాళాలే ఉండటం గమనార్హం. సగటున ఒక్కొక్కటి రూ.16వేలు చొప్పున దాదాపు 44 శాతం వ్యక్తిగత విరాళాలు కమలా హ్యారిస్‌కు అందాయి. కమల కంటే 40 శాతం తక్కువగా ట్రంప్‌కు విరాళాలు వచ్చాయి.
Also Read :NSSO Survey : తెలంగాణలో అప్పుల ఊబిలో 42 శాతం మంది.. ఎన్ఎస్ఎస్‌ఓ సంచలన నివేదిక
అమెరికాలో విరాళాల రూల్స్ ఇవీ..
- చట్టపరమైన రూల్స్ ప్రకారం.. అమెరికాలో రూ.2.77 లక్షలకు మించి ఎవ్వరూ వ్యక్తిగతంగా విరాళాలు ఇవ్వకూడదు. అయితే కంపెనీలు, కార్పొరేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు దేశంలోని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండే పొలిటికల్ యాక్షన్ కమిటీ(పీఏసీ)లకు అన్‌లిమిటెడ్‌గా విరాళాలు ఇవ్వొచ్చు.
- అమెరికా పౌరులు, గ్రీన్‌కార్డు ఉన్నవారు మాత్రమే విరాళాలు ఇవ్వాలి.
- ప్రభుత్వ కాంట్రాక్టర్లు, కార్పొరేషన్లు, జాతీయ బ్యాంకులు, లేబర్ యూనియన్లు, ఎన్జీవోలు రాజకీయ పార్టీల అభ్యర్థులకు నేరుగా ఎన్నికల విరాళాలు ఇవ్వకూడదు. అయితే పొలిటికల్ యాక్షన్ కమిటీ(పీఏసీ)లకు ఇవ్వొచ్చు. అందుకే బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ లాంటి కుబేరులు రాజకీయ పార్టీల అనుబంధ పీఏసీలకు డొనేషన్లు ఇచ్చారు.
- పొలిటికల్ యాక్షన్ కమిటీ(పీఏసీ)లు రాజకీయ పార్టీల తరఫున విరాళాలను సేకరించి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేస్తాయి.
- టీవీల్లో యాడ్స్ ఇచ్చేందుకు, బహిరంగ సభల నిర్వహణకు, సోషల్ మీడియా ప్రచారానికి ఈ డబ్బులను రాజకీయ పార్టీల పీఏసీలు ఖర్చు చేస్తాయి.
- అపర కుబేరులు రాజకీయ పార్టీలకు విరాళాలు అందించి, అవి ఎన్నికల్లో గెల్చిన తర్వాత చట్టాల రూపకల్పనలో జోక్యం చేసుకుంటారనే ప్రచారం ఉంది.