చాలా కాలం తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మళ్లీ వినిపించింది. అప్పట్లో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. మళ్లీ తాజాగా సల్మాన్ ఖాన్‌కి దగ్గరవుతున్నాడనే కారణంతో ప్రముఖ గాయకుడు గురు రంధావాను టార్గెట్ చేసింది. ఢిల్లీ వెస్ట్ విహార్ ప్రాంతంలో గురు రంధావాకు చెందిన ఒక జిమ్‌పై బుధవారం రాత్రి కాల్పులు జరిగాయి. దీనికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగే కారణమని అనిల్ పండిట్ ప్రకటించాడు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ గ్యాంగ్‌స్టర్‌గా పేరున్న బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఢిల్లీలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటనకు తమదే బాధ్యత అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. సల్మాన్ ఖాన్‌కు దగ్గరవుతున్నారనే కారణంతోనే ఈ కాల్పులకు పాల్పడినట్లు హెచ్చరించారు.
ప్రముఖ గాయకుడు గురు రంధావాకు చెందిన ఫిట్‌నెస్ సెంటర్‌లో భాగమైన ఢిల్లీ వెస్ట్ విహార్ ప్రాంతంలోని ఒక జిమ్‌ను బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. గురు రంధావాను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అనిల్ పండిట్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. గురు రంధావాకు వార్నింగ్ ఇచ్చేందుకే జిమ్‌పై కాల్పులు చేశామని ప్రకటించాడు.
“గురు రంధావా గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్‌కు చాలా దగ్గరవుతున్నాడు. అందుకే ఢిల్లీలోని అతని జిమ్‌ను టార్గెట్ చేశాం. ఇదేవిధంగా తమ శత్రువులపై మరిన్ని దాడులు జరుగుతాయి” అని హెచ్చరిస్తూ అనిల్ పండిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
పోలీసుల ప్రాథమిక విచారణలో భాగంగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఆ ఇద్దరు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించారు. జిమ్‌పై పలుమార్లు కాల్పులు జరిపి అక్కడి నుండి పరారయ్యారు. కాల్పుల సమాచారం అందుకోగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
1998లో కృష్ణ జింకను వేటాడటమే సల్మాన్ ఖాన్ – లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మధ్య విభేదాలకు ప్రధాన కారణం. హమ్ సాత్ సాత్ హైన్ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతున్న సమయంలో సల్మాన్ ఖాన్‌తో పాటు కొంతమంది నటులు కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2018లో జోధ్‌పూర్ కోర్టు సల్మాన్ ఖాన్‌ను దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఈ కేసులో సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలమ్ కొఠారి పేర్లు కూడా నమోదయ్యాయి.
బిష్ణోయ్ సమాజం ఈ జింకలను అతి పవిత్రంగా భావిస్తుంది. దాంతో సల్మాన్ ఖాన్ అనేక సార్లు టార్గెట్‌గా దాడులను ఎదుర్కొన్నారు. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో ఈ గ్యాంగ్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కెనడాలోని ఒక ఇంటిపై జరిగిన దాడితో పాటు భారతదేశం నలుమూలల్లో జరిగిన పలు ఘటనల్లో బిష్ణోయ్ గ్యాంగ్ పేరు వార్తల్లో నిలిచింది.
