Sundar Pichai: సుందర్ పిచాయ్‌కు ఊహించని షాక్‌..స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేషన్ వేడుకలో విద్యార్థుల నిరసన

స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ముఖ్య అతిథిగా ప్రసంగిస్తుండగా కొందరు విద్యార్థులు ఒక్కసారిగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సాధారణంగా ఆనందోత్సాహాల మధ్య జరిగే స్నాతకోత్సవంలో కాసేపు గందరోగళ వాతావరణం నెలకొంది. విద్యార్థుల ఈ వాకౌట్‌ వెనుక రాజకీయ, సామాజిక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘స్టూడెంట్స్‌ ఫర్‌ జస్టిస్‌ ఇన్‌ పాలస్తీనా’, ‘నో టెక్‌ ఫర్‌ అపార్థీడ్‌’ వంటి సంఘాలు ఈ నిరసనకు మద్దతు ఇచ్చినట్లు […]

Published By: HashtagU Telugu Desk
Unexpected shock for Sundar Pichai: Students protest at Stanford graduation ceremony.

Unexpected shock for Sundar Pichai: Students protest at Stanford graduation ceremony.

స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ముఖ్య అతిథిగా ప్రసంగిస్తుండగా కొందరు విద్యార్థులు ఒక్కసారిగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సాధారణంగా ఆనందోత్సాహాల మధ్య జరిగే స్నాతకోత్సవంలో కాసేపు గందరోగళ వాతావరణం నెలకొంది.

విద్యార్థుల ఈ వాకౌట్‌ వెనుక రాజకీయ, సామాజిక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘స్టూడెంట్స్‌ ఫర్‌ జస్టిస్‌ ఇన్‌ పాలస్తీనా’, ‘నో టెక్‌ ఫర్‌ అపార్థీడ్‌’ వంటి సంఘాలు ఈ నిరసనకు మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు, అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం, ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో గూగుల్‌ ఒప్పందాలు కుదుర్చుకుందనే ఆరోపణలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టినట్లు వెల్లడించాయి.

అయితే ఈ పరిణామాలపై నేరుగా స్పందించకుండా సుందర్‌ పిచాయ్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కృత్రిమ మేధ (ఏఐ), టెక్నాలజీ రంగంలోని పరిణామాల గురించి విస్తృతంగా మాట్లాడకుండా విద్యార్థుల జీవితానికి ఉపయోగపడే సూచనలు చేశారు. ప్రస్తుతం తనకు ఏం మాట్లాడాలనే దానికంటే ఏం మాట్లాడకూడదనే సలహాలే ఎక్కువగా వస్తున్నాయని సరదాగా వ్యాఖ్యానించారు.

జీవితంలో పరిస్థితులను ఎలా అర్థం చేసుకుంటామన్న దానిపైనే మన దృక్పథం ఆధారపడి ఉంటుందని పిచాయ్‌ అన్నారు. కొత్త అవకాశాలను ఆశావాదంతో స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు. 1990ల్లో కాలిఫోర్నియాకు తొలిసారి వచ్చిన రోజులను గుర్తు చేసుకుంటూ అప్పట్లో ఏర్పడిన కొన్ని అభిప్రాయాలు తర్వాత మారిపోయాయని చెప్పారు. ఒకే విషయాన్ని వేరే కోణంలో చూసినప్పుడు దాని అర్థం పూర్తిగా మారిపోతుందని వివరించారు.

ఏఐ ప్రభావంతో ఉద్యోగ అవకాశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొత్తగా ఉద్యోగ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న యువతలో ఆందోళన పెరుగుతోంది. అయితే పిచాయ్‌ తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించకుండా, మార్పులను స్వీకరించే సామర్థ్యమే భవిష్యత్తులో విజయానికి కీలకమని సూచించారు.

2015 నుంచి గూగుల్‌కు నాయకత్వం వహిస్తున్న సుందర్‌ పిచాయ్‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ మాజీ విద్యార్థి కూడా. ఏఐ సాంకేతిక రంగంలో భారీ మార్పులకు దారితీస్తోందని గతంలో ఆయన పలుమార్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పట్టభద్రులవుతున్న తరం ఆ మార్పులను చూసే వారిగానే కాకుండా, వాటిని నిర్మించే వారిగా కూడా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

  Last Updated: 15 Jun 2026, 12:07 PM IST