Trump Vs Kamala : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ మధ్య ‘ఏబీసీ న్యూస్ ఛానల్’ నిర్వహించిన లైవ్ డిబేట్ హోరాహోరీగా జరిగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్, కమల ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. డిబేట్ ప్రారంభంలో వీరిద్దరూ పలకరించుకుని షేక్‌హ్యాండ్(Trump Vs Kamala) ఇచ్చుకున్నారు. డిబేట్‌కు సంబంధించిన వివరాలను ఈ వార్తలో చూద్దాం..
Also Read :Rajinikanth : వేటయ్యన్ సాంగ్ సోషల్ మీడియాని ఊపేస్తుందిగా..!
చైనా.. మార్క్సిస్ట్..
‘‘కమలా హారిస్ పెద్ద మార్క్సిస్ట్’’ అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. బైడెన్-హారిస్‌లు కలిసి అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను కమలా హ్యారిస్ కౌంటర్ చేస్తూ.. అమెరికాను ట్రంప్ చైనాకు అమ్మేశారని ఎద్దేవా చేశారు. ట్రంప్ పాలనా కాలంలో జరిగిన తప్పిదాలను బైడెన్, తాను కలిసి సరిచేసినట్లు వెల్లడించారు. చిన్నతరహా వ్యాపారులు, కుటుంబాలకు సాయం చేసేందుకు తాము రెడీ అని కమల స్పష్టం చేశారు. స్టార్టప్‌లపై పన్నులు తగ్గిస్తామని ఈసందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ట్రంప్ మొదటినుంచీ బిలియనీర్లు, కార్పొరేట్ల సేవలో తరించడానికి అలవాటుపడ్డారని పేర్కొన్నారు. సంపన్నులకు పన్నులు తగ్గిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు 5 ట్రిలియన్ డాలర్ల లోటు ఏర్పడుతుందని కమల చెప్పారు.
Also Read :Jagan Famous Dialogue in Devara : దేవర లో ‘జగన్’ డైలాగ్.. గమనించారా..?
అబార్షన్ల బ్యాన్‌పై..
బైడెన్ పాలనలో గన్ వినియోగించే కల్చర్ పెరిగినందు వల్లే తనపై హత్యాయత్నం జరిగిందని ట్రంప్ ఆరోపించారు. దీన్ని కమలా హారిస్ ఖండించారు. ట్రంప్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని పేర్కొన్నారు. అధ్యక్షుడు అయితే అబార్షన్లపై నిషేధం విధించాలని ట్రంప్ అనుకుంటున్నారని కమల తెలిపారు. అయితేే ఈ వాదనను ట్రంప్ ఖండించారు. గర్భవిచ్ఛిత్తిపై నిషేధానికి తాను అనుకూలం కాదని తేల్చి చెప్పారు. అయితే ఎనిమిది, తొమ్మిది నెలల్లోపే చేసుకునే అబార్షన్లకు తాను వ్యతిరేకుడినని ట్రంప్ అన్నారు.
Also Read :Annapurna Studios Donation : తెలంగాణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ విరాళం
రెండేళ్లలో ఇజ్రాయెల్ కనుమరుగవుతుంది..
కమలా హ్యారిస్ అధ్యక్షురాలైతే రెండేళ్లలో ఇజ్రాయెల్ కనుమరుగవుతుందని ట్రంప్ అన్నారు. దీనికి కమల బదులిస్తూ.. తమను తాము రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని చెప్పారు. అయితే ఈ యుద్ధం ముగియాలని తాము కోరుకోవడంలో తప్పేం లేదన్నారు. ‘‘ట్రంప్ గతంలో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌కు ‘ప్రేమలేఖలు’ రాశారు. ఇప్పుడు ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కూర్చునేవారు. తాలిబన్లతోనూ ట్రంప్ చర్చలు జరిపారు. ప్రపంచ నేతలు ట్రంప్‌ను చూసి నవ్వుతున్నారు’’ అని కమలా హ్యారిస్ చెప్పారు. ‘‘బైడెన్ విధానాల వల్లే ఉక్రెయిన్‌లో లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నేను గెలవగానే ఆ యుద్ధాన్ని ఆపుతా’’ అని ట్రంప్ హామీ ఇచ్చారు. వలసదారులపై ట్రంప్ మాట్లాడుతూ.. వారంతా పెంపుడు జంతువులను తింటున్నారని మండిపడ్డారు.