ట్రంప్‌కు షాక్ ఇచ్చిన ఇరాన్‌!

ఇరాన్ తన వద్ద ఉన్న 440 కిలోల సుసంపన్నమైన యురేనియంను అప్పగించడానికి అంగీకరించిందని ట్రంప్ క్లెయిమ్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Iran Slams Trump

Iran Slams Trump

Iran Slams Trump: అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వాదనలను ఇరాన్ తీవ్రంగా తోసిపుచ్చింది. అబద్ధపు ప్రక్రియల ద్వారా ట్రంప్ ఏమీ సాధించలేరని, వివాదాలపై చర్చలు జరపడం వల్ల కూడా ప్రయోజనం ఉండదని ఇరాన్ స్పష్టం చేసింది. ట్రంప్ ఒక అబద్ధాల కోరు అని, ఆయన చేస్తున్నవన్నీ నిరాధారమైన వాదనలని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ గాలిబాఫ్ తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ట్రంప్ ప్రకటనలు తప్పు అని, చర్చల కోసం జరుగుతున్న ప్రయత్నాలు వృధా అని కొట్టిపారేశారు.

హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ తన పోస్ట్‌లో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తప్పుడు ప్రకటనలు చేశారు. ఆయన కేవలం 60 నిమిషాల్లో 7 వాదనలు చేయగా, ఆ ఏడూ నిరాధారమైనవే. అబద్ధాలు చెప్పడం ద్వారా ట్రంప్ యుద్ధం గెలవలేరు. శాంతి చర్చల ద్వారా కూడా ఆయనకు ఏమీ దక్కదు. ఒకవేళ అమెరికా గనుక హోర్ముజ్ జలసంధిపై దిగ్బంధనాన్ని కొనసాగిస్తే ఇరాన్ ఆ జలసంధిని పూర్తిగా మూసివేస్తుంది. ఆ మార్గం గుండా ఎవరిని అనుమతించాలనేది ఇరాన్ మాత్రమే నిర్ణయిస్తుంది అని రాశారు.

ఇరాన్ విషయంలో ట్రంప్ చేసిన వాదనలు

ఇరాన్ తన వద్ద ఉన్న 440 కిలోల సుసంపన్నమైన యురేనియంను అప్పగించడానికి అంగీకరించిందని ట్రంప్ క్లెయిమ్ చేశారు. అయితే ఈ అంశంపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ స్పష్టం చేసింది. ట్రంప్ వాదన అబద్ధమని, ఇరాన్ తన యురేనియంను ఎక్కడికీ పంపదని తేల్చిచెప్పింది. ఇరాన్ విధించిన షరతులను అంగీకరిస్తేనే శాంతి చర్చలు ముందుకు సాగుతాయని పేర్కొంది. అమెరికా-ఇరాన్ ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయని, త్వరలోనే యురేనియంపై ఒప్పందం జరుగుతుందని ట్రంప్ అంతకుముందు ధీమా వ్యక్తం చేశారు.

Also Read: కర్బూజా పండు కంటే తొక్కలే ఎక్కువ ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయా?

షరతులు పాటించకపోతే తీవ్ర పరిణామాలు: ట్రంప్ హెచ్చరిక

అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత యురేనియంపై వ్యూహరచన చేసేందుకు తాను స్వయంగా పాకిస్థాన్ వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాలను పొందనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ తమ షరతులకు లొంగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలంటే ఇరాన్ తమ షరతులను పాటించాల్సిందేనని ట్రంప్ పట్టుబడుతున్నారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిలో దిగ్బంధనం కొనసాగుతున్నప్పటికీ ఇతర దేశాల నౌకల రాకపోకల కోసం అది తెరిచే ఉంటుందని అమెరికా తెలిపింది.

  Last Updated: 18 Apr 2026, 11:57 AM IST