Site icon HashtagU Telugu

Al Jazeera : కెమెరాలు తీసుకొని.. ఆఫీసు మూసేసి వెళ్లిపోండి.. అల్ జజీరాకు ఇజ్రాయెల్ వార్నింగ్

Al Jazeera Israel Raids

Al Jazeera : ఇజ్రాయెల్ మరోసారి మీడియా గొంతును నులిమే చర్యలు చేపట్టింది. ఇవాళ తెల్లవారుజామున  పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ ప్రాంతం రమల్లా ఏరియాలో ఉన్న ఖతర్ ప్రభుత్వ మీడియా సంస్థ అల్ జజీరా కార్యాలయంలోకి ఇజ్రాయెలీ సైనికులు చొరబడి నానా రచ్చ చేశారు. 45 రోజుల పాటు ఆఫీసును మూసేయాలని అల్ జజీరా ఆఫీసు నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. భారీగా ఆయుధాలతో వచ్చిన ఇజ్రాయెలీ సైనికులు తమ భయభ్రాంతులకు గురి చేశారని అల్ జజీరా వెస్ట్ బ్యాంక్ ఏరియా బ్యూరో చీఫ్ వాలిద్ అల్ ఒమరీ ఆరోపించారు. అయితే ఆఫీసును తాము ఎందుకు మూసివేయాలి ? అని అడిగితే మాత్రం ఇజ్రాయెలీ సైనికులు సమాధానం చెప్పలేదన్నారు. ‘‘అల్ జజీరా ఆఫీసును 45 రోజుల పాటు మూసివేయాలని ఓ కోర్టు తీర్పు ఇచ్చింది. మీరు వెంటనే కెమెరాలు తీసుకొని ఈ ఆఫీసు నుంచి వెళ్లిపోండి’’ అని ఓ ఇజ్రాయెలీ సైనికుడు అల్ జజీరా సిబ్బందికి వార్నింగ్ ఇచ్చాడు.  ఈమేరకు వివరాలతో అల్ జజీరా(Al Jazeera) ఓ కథనాన్ని ప్రచురించింది.

Also Read :Hydra : కూకట్‌పల్లి నల్లచెరువులో అక్రమ కట్టడాలపై హైడ్రా యాక్షన్

వాస్తవానికి కొన్ని నెలల క్రితమే ఇజ్రాయెల్‌లో అల్ జజీరా మీడియా సంస్థ కార్యకలాపాలను నిషేధిస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెస్ట్ బ్యాంక్ అనేది పాలస్తీనా పరిధిలోని ప్రాంతం. అయినా అక్కడ కూడా ఇజ్రాయెలీ ఆర్మీ అల్ జజీరా కార్యకలాపాలు లేకుండా చేసేందుకు యత్నిస్తుండటం గమనార్హం. పాలస్తీనా ప్రాంతంలో ఇజ్రాయెలీ సైన్యం చేసే అరాచకాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తేవడంలో అల్ జజీరా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే అల్ జజీరాను తమ దేశానికి ముప్పుగా ఇజ్రాయెల్ చెబుతోంది.  ఈ ఏడాది మేనెలలో జెరూసలెంలోని అల్ జజీరా ఆఫీసుపైనా ఇజ్రాయెలీ పోలీసులు రైడ్స్ చేశారు.

Also Read :Liver Health Tips : తెల్లవారుజామున చేసే ఈ పొరపాట్లు కాలేయాన్ని డిస్టర్బ్ చేస్తాయి.!

గత నెలలో గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడిలో అల్ జజీరా జర్నలిస్ట్ ఇస్మాయిల్ అల్-ఘౌల్‌ చనిపోయారు. దీనిపై ఇజ్రాయెల్ అప్పట్లో స్పందిస్తూ.. సదరు అల్ జజీరా జర్నలిస్టు ఒక హమాస్ కార్యకర్త అని, ఆయన ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 ఉగ్రదాడిలో పాల్గొన్నాడని తెలిపింది. ఇజ్రాయెల్ ఆర్మీ ఉగ్రదాడుల పేరుతో గతేడాది అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు దాదాపు 45 వేల మంది పాలస్తీనా పౌరుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. యావత్ పాలస్తీనాలోని ఇళ్లను కూల్చివేసి.. అక్కడి లక్షలాది మంది ప్రజలు గుడారాల కింద జీవించే దుస్థితిని తీసుకొచ్చింది. దీనికి యావత్ ప్రపంచమే సాక్ష్యం.