Car Attack : జర్మనీలోని మాగ్డేబర్గ్ నగరంలో ఉగ్రదాడి జరిగింది. జర్మనీ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7 గంటలకు నగరంలోని క్రిస్మస్ మార్కెట్‌లో సౌదీ జాతీయుడైన ఒక వ్యక్తి కారును అతివేగంతో నడిపాడు. పెద్దసంఖ్యలో ప్రజలు క్రిస్మస్ షాపింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడున్న వాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. మొత్తం మీద కారు అతివేగంగా జనంపైకి దూసుకురావడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన వారిలో ఒక యువకుడు, ఒక బాలుడు ఉన్నట్లు గుర్తించారు. క్రిస్మస్ మార్కెట్‌లో దాదాపు 400 మీటర్ల దూరం పాటు జనంపై నుంచి కారు దూసుకుపోయిందని విచారణలో తేలింది. చనిపోయిన వారి సంఖ్య 15కు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో దాదాపు 68 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. వారందరిని హుటాహుటిన ఆస్పత్రుల్లో చేర్పించారు. ఇక వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు రంగంలోకి దిగి.. కారు దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. గన్ పాయింట్‌ను గురి పెట్టి.. అతడిని జర్మనీ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దాడికి.. 2016 సంవత్సరంలో జర్మనీలో జరిగిన ఉగ్రదాడితో పోలికలు ఉన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అప్పట్లో జరిగిన ఉగ్రదాడిలో 13 మంది చనిపోయారు.
Also Read :Guava In Winter: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండు రోజూ తినాల్సిందే!
కారుతో జనంపై దాడికి పాల్పడిన సౌదీ జాతీయుడి పేరు తాలిబ్(Car Attack) అని గుర్తించారు. అతడి వయసు దాదాపు 50 ఏళ్లు ఉంటుందని తెలిపారు. అతడు సైకియాట్రీ, సైకో థెరపీ విభాగాల్లో నిపుణుడైన డాక్టర్ అని వెల్లడైంది. తాలిబ్ 2006 సంవత్సరం నుంచి జర్మనీలోనే ఉంటున్నట్లు తెలిసింది. 2016 సంవత్సరంలో అతడికి జర్మనీ శాశ్వత నివాస ధ్రువీకరణ కూడా జారీ అయిందని తేలింది. జర్మనీలోని మాగ్డేబర్గ్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని బెర్న్ బర్గ్ నగరంలో మెడికల్ కన్సల్టెంట్‌గా తాలిబ్ సేవలు అందించేవాడని చెప్పారు.