Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా వాణిజ్య విధానాలపై ఘాటైన విమర్శలు చేశారు. భారత్, చైనా వంటి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలను అమెరికా భారీ సుంకాల రూపంలో ఆర్థిక ఒత్తిడికి గురి చేయాలని ప్రయత్నించడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా విధానం వల్ల ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలపైనే కాక, అంతర్జాతీయ వాణిజ్య సమతుల్యతపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని పుతిన్ వ్యాఖ్యానించారు.
చైనా పర్యటనలో భాగంగా షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆసియాలో అత్యంత శక్తివంతమైన రెండు దేశాలైన భారత్, చైనాలు ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రధాన శక్తులుగా మారుతున్నాయని గుర్తు చేశారు. “దాదాపు 150 కోట్ల జనాభా ఉన్న ఈ రెండు దేశాలు రాజకీయ, ఆర్థిక రంగాల్లో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. అలాంటి దేశాలను సుంకాలతో శిక్షించాలని ప్రయత్నించడం వాస్తవానికి వారి నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావడమే” అని పుతిన్ స్పష్టం చేశారు.
Bigg Boss: బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్ల జాబితా లీక్.? సోషల్ మీడియాలో చర్చ హీట్..!
భారత్, చైనాల చరిత్రలో వలసవాదం వలన ఎన్నో కష్టకాలం ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ, “ఒకప్పుడు వారి సార్వభౌమత్వాన్ని తుంచిపారేస్తూ పన్నులు విధించారు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు మళ్లీ అదే తరహా ఒత్తిడిని సృష్టించే ప్రయత్నం చేయడం తగదు. భాగస్వాములతో వ్యవహరించే సమయంలో గౌరవప్రదమైన భాష, సరైన మాటలు వాడాలి” అని ఆయన సూచించారు.
ప్రస్తుతం అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలు సుంకాల వివాదం కారణంగా ఉద్రిక్తంగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ట్రంప్ ప్రభుత్వం అధిక సుంకాలు విధించింది. దీనిపై అమెరికాలోని కొందరు నేతలు భారత్‌ను విమర్శిస్తున్నారని పుతిన్ గుర్తు చేశారు. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్, భారత్‌పై ఇప్పటివరకు కేవలం ద్వితీయ శ్రేణి సుంకాలనే విధించామని, ఇంకా రెండు, మూడు దశలు మిగిలి ఉన్నాయని వ్యాఖ్యానించారు. అదేవిధంగా, ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను వసూలు చేసే దేశం భారత్ అని కూడా ఆయన ఆరోపించారు.
అయితే, ఈ ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగవని, సమీప భవిష్యత్తులో పరిస్థితులు సర్దుబాటు అవుతాయని పుతిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. “ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే, శక్తివంతమైన దేశాలు పరస్పర సహకారం చూపాలి. భారత్, చైనాల ఎదుగుదలను అడ్డుకోవడం కంటే, వారితో కలిసి పనిచేయడం అమెరికాకు కూడా మేలు చేస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో పుతిన్ మరోసారి భారత్‌కు మద్దతు ప్రకటించడమే కాకుండా, అమెరికా వాణిజ్య విధానాలపై అంతర్జాతీయ వేదికలలో చర్చకు దారితీశారు. SCO సమావేశం ముగింపు సందర్భంలో చేసిన ఈ వ్యాఖ్యలు భారత్-చైనా-రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
AP : ఏపీలో 3 నెలల ముందే స్థానిక ఎన్నికలు..సన్నాహకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం!