Nepal : నేపాల్‌లో ఇటీవల సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధం తీవ్ర నిరసనలు, హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ప్రభుత్వం తక్షణమే నిర్ణయం వెనక్కి తీసుకుంది. సోమవారం అర్థరాత్రి తరువాత అధికారికంగా ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో తీసుకున్న కీలక నిర్ణయంగా భావించబడుతోంది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ అధ్యక్షతన సోమవారం రాత్రి అత్యవసర క్యాబినెట్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం సమాచార, ప్రసారశాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ మీడియాతో మాట్లాడుతూ..ప్రజల్లో అసంతృప్తిని గమనించి, పరిస్థితిని సమీక్షించిన తర్వాత సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం అధికారికంగా ఎత్తివేస్తోంది. ఇకపై అన్ని ప్లాట్‌ఫామ్లు సాధారణంగా పనిచేస్తాయి అని తెలిపారు.
Read Also: Vice President Election : ఉప రాష్ట్రపతి ఎన్నిక: ప్రారంభమైన పోలింగ్.. ఓటేసిన ప్రధాని మోడీ
గత గురువారం, ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (మునుపటి ట్విట్టర్), లింక్డిన్, రెడిట్ వంటి 26 ప్రముఖ సామాజిక మాధ్యమాలు నేపాల్ కమ్యూనికేషన్ శాఖలో రిజిస్టర్ కావడంలో విఫలమైన నేపథ్యంలో ప్రభుత్వంగా నిషేధం విధించింది. అయితే, ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా యువతలో అసంతృప్తి పెరిగింది. ఖాట్మండు, పోఖరా, బిర్‌గంజ్ వంటి ముఖ్య పట్టణాల్లో పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. ఆందోళనకారులు పార్లమెంట్ భవనం వైపు ముట్టడికి యత్నించగా, పోలీసులు వాటిని అడ్డుకునేందుకు టియర్ గ్యాస్, జలఫిరంగులు, రబ్బరు బుల్లెట్లు వాడారు. ఈ ఘటనల్లో దురదృష్టవశాత్తు 19 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది యువతే ఉండడం ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే వ్యవహరించి, సంబంధిత శాఖలతో చర్చించి నిషేధాన్ని ఎత్తివేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్, ఎక్స్ తదితర మాధ్యమాలు మళ్లీ యాక్సెస్‌కి వచ్చాయి. ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై ప్రజలు ఆందోళనలు విరమించాలని కోరుతున్నాం అని మంత్రి గురుంగ్ విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, నేపాల్‌లో ఉత్కంఠభరిత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారత్ అక్కడున్న తన పౌరులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. విదేశాంగశాఖ ప్రకటనలో నేపాల్‌లోని స్థానిక అధికారుల సూచనలు, ఆదేశాలను భారతీయులు తప్పనిసరిగా పాటించాలి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలి అని సూచించింది. సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎంతవరకు సమంజసం అన్నదానిపై నిపుణులు ప్రశ్నలు వేస్తున్నారు. ప్రజల నిత్య జీవితాల్లో భాగంగా మారిన ఈ మాధ్యమాలపైగా ఆంక్షలు విధించడం వల్ల సమాచారం హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలపై ప్రభావం పడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నేపాల్ వంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభిప్రాయాలను గౌరవించకపోవడం, ఫలితంగా జరిగిన ప్రాణనష్టం, సామాజిక స్థితిగతుల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఉదాహరణగా ఇది నిలిచిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Malla Reddy : ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు స్పీడ్ : మల్లారెడ్డి ప్రశంసలు