Masoud Pezeshkian పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న ఘర్షణకు ముగింపు పలకడానికి ఇరాన్ మూడు కీలక షరతులను ముందుకు తెచ్చింది. ఒకవైపు శాంతి కోసం ప్రతిపాదనలు చేస్తూనే, మరోవైపు తమపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ దేశ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.
Talking to leaders of Russia and Pakistan, I reaffirmed Iran’s commitment to peace in the region. The only way to end this war—ignited by the Zionist regime & US—is recognizing Iran’s legitimate rights, payment of reparations, and firm int'l guarantees against future aggression.
— Masoud Pezeshkian (@drpezeshkian) March 11, 2026
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఈ షరతులను ప్రకటించారు. రష్యా, పాకిస్థాన్ దేశాధినేతలతో మాట్లాడిన తర్వాత ఆయన ఈ పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్, అమెరికా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ముగించాలంటే ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో తమ దేశంపై మళ్లీ దాడులు జరగకుండా కఠినమైన అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మూడు షరతులకు అంగీకరిస్తేనే శాంతి సాధ్యమని ఆయన తేల్చిచెప్పారు
ఇరాన్ అధ్యక్షుడు శాంతి కోసం షరతులు విధిస్తున్న తరుణంలోనే ఆ దేశ సైన్యం నుంచి తీవ్ర హెచ్చరికలు వెలువడ్డాయి. ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి అబోల్ఫజల్ షెకార్చి ప్రభుత్వ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అమెరికా తమ దేశంలోని పోర్టులపై దాడి చేస్తే, పర్షియన్ గల్ఫ్‌లోని ఏ ఒక్క పోర్టు, ఆర్థిక కేంద్రం, లేదా ఇతర ప్రాంతం సురక్షితంగా ఉండదని హెచ్చరించారు. “మా ఓడరేవులపై దాడులు జరిగితే, ఈ రీజియన్‌లోని అన్ని పోర్టులు, రేవులు మా చట్టబద్ధమైన లక్ష్యాలుగా మారతాయి” అని ఆయన పేర్కొన్నారు.
అంతేగాక తమ పోర్టులపై దాడి జరిగితే ఇప్పటివరకు చేసిన దానికంటే చాలా భారీ స్థాయిలో సైనిక చర్య చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని దేశాలు తమ భూభాగాల నుంచి అమెరికన్లను తరిమికొట్టాలని కూడా షెకార్చి పిలుపునిచ్చారు. ఒకవైపు ఇరాన్ రాజకీయ నాయకత్వం శాంతి కోసం షరతులు పెడుతూనే, మరోవైపు సైనిక నాయకత్వం తీవ్రమైన పరిణామాల గురించి హెచ్చరించడం పశ్చిమాసియాలో నెలకొన్న సంక్లిష్ట, ఉద్రిక్త పరిస్థితికి అద్దం పడుతోంది.
