స్విట్జర్లాండ్‌లో శాంతి ఒప్పంద చర్చలు జరిగిన కొద్ది రోజులకే మళ్లీ అమెరికా – ఇరాన్ మధ్య క్షిపణి దాడులు జరిగాయి. ఈ సారి భీకరంగా జరిగిన దాడుల్లో ఇరు దేశాలు నష్టపోయాయి. ఇరాన్‌లోని కీలక స్థావరాలను టార్గెట్ చేసుకుని అమెరికా మిస్సైల్స్ ప్రయోగించగా.. కువైట్, బహ్రాయిన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. అయితే, ఇరు దేశాలు ప్రస్తుతం తాత్కాలికంగా దాడులు నిలిపివేసి మళ్లీ చర్చల బాట పట్టాయి.
ఖతార్ రాజధాని దోహాలో మంగళవారం సమావేశమై హార్మూజ్ జలసంధి వివాదంపై చర్చించేందుకు అమెరికా – ఇరాన్ దేశాలు అంగీకరించినట్లు సమాచారం. యుద్ధ విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ వీకెండ్‌లో అమెరికా, ఇరాన్ మరోసారి పరస్పరం దాడులు చేసుకున్నాయి. దాంతో మిడిల్ ఈస్ట్‌లో ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి.
హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడమే మళ్లీ ఉద్రిక్తతలకు కారణం. ఈ దాడులకు ఇరాన్ కారణమంటూ అమెరికా ఆరోపిస్తూ.. ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. అయితే, వాణిజ్య నౌకలపై జరిగిన తొలి దాడికి తమకూ ఎలాంటి సంబంధం లేదంటూ ఇరాన్ ఖండించింది.
ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అమెరికా దాడులు పరస్పర అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని.. అందుకే క్షిపణి, డ్రోన్, రాడార్ కేంద్రాలపై దాడులు చేసినట్లు సమర్థించుకున్నారు.
ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు దేశాలు తాత్కాలికంగా సైనిక దాడులు నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. అమెరికాకు చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ సైనిక చర్యలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మరో అధికారి మాట్లాడుతూ ఇకపై హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని చెప్పారు.
ఖతార్ రాజధాని దోహాలో మంగళవారం జరగనున్న చర్చల్లో హార్మూజ్ జలసంధి సమస్యపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. తొలుత ఈ చర్చలు స్విట్జర్లాండ్‌లో నిర్వహించి ఇరాన్ అణు కార్యక్రమం గురించి చర్చించాలని అనుకున్నారు. కానీ హార్మూజ్‌లో ఏర్పడిన ఉద్రిక్తతతో దోహాలో చర్చించేందుకు నిర్ణయించారు.
