Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గత కొన్నేళ్లుగా జైలుశిక్షను అనుభవిస్తున్నారు. దేశ ద్రోహం సహా పలు కేసుల్లో ఆయన అభియోగాలను ఎదుర్కొంటున్నారు. కొన్ని కేసుల్లో ఇప్పటికే దోషిగా తేలారు. దీంతో జైలు నుంచి ఆయన విడుదల కష్టతరంగా మారింది. ఇమ్రాన్ ఖాన్‌పై ప్రస్తుత ప్రభుత్వం లేనిపోని కేసులన్నీ మోపిందనే ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్ వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సు జరుగుతున్న తరుణంలో ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను(Imran Khan) వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జైలులో ఇమ్రాన్ వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని జెమీమా చెప్పుకొచ్చారు.
Also Read :IAS Officers Vs CAT : ‘క్యాట్’ తీర్పుపై హైకోర్టులో ఐఏఎస్‌ల పిటిషన్.. కాసేపట్లో విచారణ
‘‘ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‌ను కనీసం ఆయన తరఫు న్యాయవాదులు కూడా కలవలేకపోతున్నారు. కుటుంబ సభ్యులను ఎవ్వరినీ కలవనివ్వడం లేదు. పాకిస్తాన్ అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌పై ఉన్న వివిధ కేసుల్లో కోర్టు విచారణలను కూడా వాయిదా వేయించారు’’ అని ఆమె ఆరోపించారు. ‘‘మాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు ఖాసిం, సులేమాన్. నా ఇద్దరు కొడుకులతో లండన్‌లో ఉంటున్నాను. నా కుమారులు ఇద్దరూ గతంలో తరుచుగా పాకిస్తాన్‌కు వెళ్లి వారి తండ్రి ఇమ్రాన్ ఖాన్‌ను కలిసొచ్చే వారు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నా కుమారుడు వెళ్లి పాకిస్తాన్ జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసే అవకాశం లేకుండాపోయింది. జైలు అధికారులు ఇమ్రాన్‌ను కలిసేందుకు నా కుమారులకు అనుమతి ఇవ్వడం లేదు’’ అని జెమీమా గోల్డ్‌స్మిత్ తెలిపారు. ‘‘జైలులో ఇమ్రాన్ ఖాన్ ఉండే సెల్‌లో కనీస కరెంటు వసతి లేదని నాకు తెలిసింది. ఆయనను సెల్ నుంచి బయటకు అడుగుపెట్టనివ్వడం లేదని సమాచారం. జైలు కుక్‌ను సెలవుపై పంపారట. సకాలంలో ఇమ్రాన్‌కు భోజనం అందకుండా చేసేందుకే ఇదంతా చేస్తున్నారట. నాకు చాలా బాధేస్తోంది’’ అని జెమీమా ఆవేదన వ్యక్తం చేశారు.