Hezbollah Vs Lebanon : ఓ వైపు పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్.. మరోవైపు లెబనాన్‌పైనా విరుచుకుపడుతోంది. అయితే లెబనాన్‌లోని షియా మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా నుంచి ఇజ్రాయెల్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. తాజాగా ఇవాళ ఉదయం ఏకంగా 320 కట్యుషా రాకెట్లను ఇజ్రాయెల్‌పైకి హిజ్బుల్లా ప్రయోగించింది. ఈ రాకెట్లు ఇజ్రాయెల్‌లోని దాదాపు 11 నగరాల్లో పడినట్లు తెలుస్తోంది. ఈ రాకెట్లు రష్యాకు చెందినవి. ఇవి హిజ్బుల్లాకు ఎలా అందాయి అనేది తెలియాల్సి ఉంది. లెబనాన్ పొరుగునే ఉండే సిరియాలో రష్యా ఆర్మీ తరఫున కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాని నుంచే హిజ్బుల్లాకు ఈ తరహా ఆయుధాలు అందుతుంటాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. హిజ్బుల్లా(Hezbollah Vs Lebanon) వద్ద రష్యాకు చెందిన ఇంకా ఏమేం ఆయుధాలు ఉన్నాయనేది పెద్ద మిస్టరీగా మారింది.
We’re now on WhatsApp. Click to Join
ఏకకాలంలో హిజ్బుల్లా 320 కట్యుషా రాకెట్లను ప్రయోగించిన వెంటనే ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులు మొదలుపెట్టింది. ఈసారి దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ద విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. వీటిలో హిజ్బుల్లా సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఇజ్రాయెల్‌పై మరింత తీవ్రమైన దాడులు చేయాలని హిజ్బుల్లా పథక రచన చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌కు సమాచారం అందింది. దీంతో లెబనాన్‌పై దాడులను తీవ్రతరం చేసినట్లు సమాచారం.
హిజ్బుల్లా ప్రతిదాడులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉండటంతో లెబనాన్ సరిహద్దుకు సమీపంలో ఉండే బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలను దారి మళ్లించారు. మరోవైపు లెబనాన్‌తో యుద్దంపై సమీక్షించేందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపితే.. తాము ఇజ్రాయెల్‌పై దాడులను ఆపుతామని హిజ్బుల్లా వాదిస్తోంది. ఈనేపథ్యంలో ఎలాంటి భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్లాలనేది ఈ సమీక్ష సమావేశంలో నెతన్యాహూ నిర్ణయించనున్నారు.