US Vs NATO : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ’ (డోజ్) విభాగం సారథి హోదాలో అమెరికా ప్రభుత్వంలో మస్క్ చక్రం తిప్పుతున్నారు. ముఖ్యమైన అంశాలపై ప్రెసిడెంట్ ట్రంప్‌కు తనదైన శైలిలో ఆయన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. నాటో కూటమి చాలా పవర్ ఫుల్. ఏకంగా రష్యాను సవాల్ చేయగల సత్తా నాటో సొంతం. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO). అమెరికా, ఐరోపా దేశాల సంయుక్త సైనిక కూటమికి నాటో అనే పేరును పెట్టారు. నాటో కూటమి నుంచి అమెరికా బయటికి వచ్చేయాలని తాజాగా ట్రంప్‌నకు ఎలాన్ మస్క్ సంచలన సూచన చేశారు. ఐక్యరాజ్యసమితి నుంచి కూడా అమెరికా బయటికి వస్తే బాగుంటుందన్నారు. నాటో, ఐరాసలో ఉండటం వల్ల అమెరికా ప్రభుత్వం అనవసర అదనపు ఖర్చులు చేయాల్సి వస్తోందని మస్క్ పేర్కొన్నారు. నాటో కూటమిలోని ఐరోపా దేశాల రక్షణ కోసం అమెరికా ఏటా బడ్జెట్ కేటాయించడం అనే సంప్రదాయాన్ని ఇకనైనా ఆపాలని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read :MLA Quota MLCs: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్
ట్రంప్ సంచలన రియాక్షన్
‘‘నా కంపెనీ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను ఆపేస్తే ఇక రష్యాతో ఉక్రెయిన్ యుద్ధమే చేయలేదు. అంత దారుణ స్థితిలో ఉక్రెయిన్ ఉంది’’ అని మస్క్ పేర్కొన్నారు. ఇందుకు కొనసాగింపుగా ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US Vs NATO) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాటో కూటమి కోసం కేవలం అమెరికాయే నిధులను ఇవ్వాలంటే ఇక కుదరదు. మేం మాత్రమే ఖర్చులు భరించడం అన్యాయం. కూటమిలోని ఇతర దేశాలు కూడా తమవంతుగా నిధులు ఇవ్వాలి. లేదంటే నాటో కూటమిలోని దేశాల నుంచి మా దళాలను వెనక్కి తీసుకుంటాం’’ అని ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తదుపరిగా ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? నాటో నుంచి అమెరికాను బయటికి తీసుకొస్తారా ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read :SSMB29 Leak : ఆయన ఎదుట మోకరిల్లిన మహేశ్‌బాబు.. ‘ఎస్ఎస్ఎంబీ-29’ లీక్
అమెరికా ఎగ్జిట్ అయితే..
ఒకవేళ అమెరికా ఎగ్జిట్ అయితే నాటో కూటమి బలహీనపడే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఐరోపా దేశాలు సైనికపరంగా ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు తక్కువేనని పరిశీలకులు అంటున్నారు. రష్యాను బలంగా ఢీకొనాలంటే తమకు అమెరికా సహకారం అవసరమని ఐరోపా దేశాలకు తెలుసు. అందుకే తమవంతు నిధులను ఇచ్చేందుకే ఐరోపా దేశాలు మొగ్గుచూపొచ్చు. అమెరికా సైతం నాటో నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశాలు దాదాపు లేవట. ఒకవేళ అమెరికా ఎగ్జిట్ అయితే, ఐరోపా ఖండంలోని కొన్ని దేశాలకు దగ్గరయ్యేందుకు రష్యా ప్రయత్నాలు మొదలుపెట్టొచ్చు. అదే జరిగితే రష్యా భౌగోళిక బలం పెరుగుతుంది. అమెరికా అస్సలు నచ్చని విషయం ఇదే. అందుకే నాటో నుంచి అమెరికా నిష్క్రమణ అనేది అసాధ్యమని విశ్లేషిస్తున్నారు.