Elon Musk: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నవంబరు 5న జరగబోతోంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఆయనకు ఈసారి అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా మద్దతు ప్రకటించారు. ఎన్నికల ప్రచార బరిలోకి సైతం ఆయన దూకారు. ట్రంప్ తరఫున ఎన్నికల ప్రచార బాధ్యతలను అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ) నిర్వర్తిస్తోంది. ఈ తరుణంలో ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. పోలింగ్ తేదీ (నవంబరు 5) వరకు ప్రతీరోజు ఒక ఓటరుకు రూ.8 కోట్లు చొప్పున అందిస్తానని ఆయన వెల్లడించారు. శనివారం రోజు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హ్యారిస్ బర్గ్ నగరంలో జరిగిన రిపబ్లికన్ పార్టీ కార్యక్రమం వేదికగా మస్క్(Elon Musk) ఈ ప్రకటన చేశారు.
ఏమిటీ ఆఫర్ ?
రోజూ రూ.8 కోట్ల ఆఫర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ముందస్తు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలు అమెరికా రాష్ట్రాల్లో ప్రజలు ముందస్తు ఓట్లను వేస్తున్నారు. ఇలా పడే ఓట్లు డొనాల్డ్ ట్రంప్‌కు కలిసొచ్చేలా ఆకర్షణీయమైన స్కీంను ఎలాన్ మస్క్ ప్రకటించారు. ముందస్తు ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఓటు వేయడంతో పాటు తమకు తెలిసిన మరింత మంది ఓటర్ల సమాచారాన్ని రాసి అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ)కి అందించాలని మస్క్ పిలుపునిచ్చారు. తద్వారా ట్రంప్ గెలుపునకు అండగా నిలవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీలకు చెందిన వారైనా ఈవిధంగా సమాచారాన్ని రాసి అమెరికా పీఏసీకి అందించవచ్చని చెప్పారు. ఇలా సమాచారం ఇచ్చే వారి వివరాలను లక్కీ డ్రా తీసి.. ప్రతిరోజు ఒక వ్యక్తికి రూ.8.40 కోట్లు చొప్పున పారితోషికం అందిస్తానని మస్క్ వెల్లడించారు. సాక్షాత్తూ అపర కుబేరుడే ఈప్రకటన చేయడంతో అమెరికా ఓటర్లు ఎంతో ఆసక్తిగా ముందస్తు ఓటింగ్‌లో భాగస్వాములు అవుతున్నారు. దీనివల్ల పలు అమెరికా రాష్ట్రాల్లో పోలింగ్ శాతం పెరిగిందని సమాచారం. మొత్తం మీద ఎలాన్ మస్క్ తనదైన రేంజులో అమెరికా ఓటర్లకు ఆఫర్‌ను ప్రకటించడం అందరి చూపును ఆకట్టుకుంటోంది.